breaking news
Telangana Bandh Success
-
బంద్ సంపూర్ణం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జీవోఎం ప్రతిపాదించిన రాయ ల తెలంగాణను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు గురువా రం జిల్లాలో బంద్ సంపూర్ణంగా విజ యవంతమైంది. ఎన్నడూ లేనివిధం గా నియోజకవర్గం, మండల కేంద్రా లు, గ్రామాల్లో ప్రజలు, తెలంగాణ వాదులు పార్టీలకతీతంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, కర్షకులు రాయల తెలంగాణకు వ్యతిరేకంగా కదం తొక్కారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శన చేశారు. ఆర్టీసీ కార్మికులు బంద్‌కు మద్దతుగా ఒక్క రోజు సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలోని ఆరు డిపోల నుంచి ఒక్కబస్సు కూడా రోడ్డెక్కని పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు జిల్లా బంద్‌ను విజయవంతం చేయడంలో తమ వంతు పాత్రను పోషించారు. పీడీఎస్‌యూ, ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు యంత్రాంగం పట్టణాలు, నియోజక వర్గం, మండల కేంద్రాల్లో బందోబస్తును నిర్వహించింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగలవని భావించిన ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బస్సులు తిరగనందున ఆర్టీసీ రూ. 60 లక్షల ఆదాయం కోల్పోయింది. కలెక్టరేట్లోని ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది బంద్‌కు మద్దతుగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోలు బంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి. సినిమా థియేటర్లలో ఉదయం ఆటలు నిలిపివేశారు. నిజామాబాద్‌లో మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి ఇంటిని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ముట్టడించారు. భారీ పోలీసు బందోబస్తును లెక్కచేయకుండా విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతిని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బస్టాండ్ ఎదుట బైఠాయించారు. భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పది మంది ఏఐఎస్ఎఫ్ నాయకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన 45 మందిని పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడిచి పెట్టారు. జిల్లా కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి, బిచ్కుంద ప్రాంతాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి బంద్‌లో భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. నిరసన ప్రదర్శన నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాలో ఆరు ఆర్టీసీ డిపోలకు చెందిన 637 బస్సులు నిలిచి పోయాయి. ఆర్టీసీ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఆర్మూర్‌లో టీఆర్ఎస్ నేత జీవన్‌రెడ్డి తదితరులతో పాటు బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ, న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. నందిపేటలో రాయల తెలంగాణకు నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. బోధన్, కోటగిరి, ఎడపల్లి ప్రభుత్వ ఉపాధ్యాయులు శిక్షణ తరగతులు బహిష్కరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. బోధన్, ఎడపల్లి, రెంజల్ మండల కేంద్రాల్లో టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి బంద్‌ను పర్యవేక్షించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజక వర్గాల కేంద్రాలతో పాటు మండలాల్లో బంద్ విజయవంతమైంది. బాన్సువాడలో బంద్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షించారు. డిచ్‌పల్లిలో టీఆర్ఎస్ రూరల్ ఇన్చార్జి డాక్టర్ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించారు. గన్నారం శివారులోని 44వ నెంబరు జాతీయ రహదారిపై టీడీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని రోడ్డుపైన బైఠాయించి ధర్నా నిర్వహించారు. జీవోఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ కోసం అమరుడైన రాములుకు నివాళులర్పించారు. కామారెడ్డి పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐల ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్ ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆర్మూర్, కామారెడ్డిలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. -
బంద్ సక్సెస్
ఖమ్మం, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ జేఏసీ పిలుపులో బాగంగా గురువారం తలపెట్టిన బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగులు సంతకాలు చేసి బయటకు వచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేశారు. టీఆర్ఎస్, సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, బీజేపీ, లోక్‌సత్తా పార్టీలు, అనుబంధ సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి, వైరా, మధిరతోపాటు అన్ని మండల కేంద్రాల్లో బంద్ పాటించారు. నాయకులు ప్రధాన కూడళ్లలో మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. మానవహారాలు చేపట్టారు. కళాకారులు ఆటాపాటలతో ప్రదర్శనలు చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బంద్‌తో నిత్యం జనసందోహంతో ఉండే ప్రధాన వీధులు, వ్యాపార కేంద్రాలు, పెట్రోల్ బంక్‌లు, బస్టాండ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. తెల్లవారుజామున 4 గంటలకే బస్‌డిపోల వద్దకు చేరుకున్న ఉద్యమకారులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో ఒక్క బస్సుకూడా రోడ్డెక్కలేదు. బస్ డిపోలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఖమ్మంలో టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ, బీజేపీ, లోక్‌సత్తా పార్టీలు, ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి చేరుకొని షాపులు, వ్యాపార కూడళ్లను మూయించి బంద్‌ను జయప్రదం చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే ఆర్టీసీ డిపోకు చేరుకొని బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్‌లు, బ్యాంక్‌లు తెరుచుకోలేదు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో ప్రరద్శన నిర్వహించి జడ్పీసెంటర్‌లో భారీ మానవహారం నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు కూరపాటి రంగరాజు, నడింపల్లి వెంకటపతిరాజు, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఎస్కె.ఖాజామియా, సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, ఏన్కూర్, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. కొణిజర్లలో టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వైరాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి వేయించారు. మండల అధికారులు బంద్‌కు మద్దతు పలికారు. జూలూరుపాడులో టీఆర్ఎస్ కార్యకర్తలు అరగుండుతో నిరసన తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో టీజేఏసీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బంద్, బైక్ ర్యాలీ నిర్వహించారు. అశ్వారావుపేట మండలం నారాయణపురంలో వీకేడీవీఎస్ఆర్ కళాశాల బస్సును యువకులు అడ్డుకున్నారు. దమ్మపేటలో టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీ నాయకులు బంద్ పాటించారు. కుక్కునూరు, ముల్కలపల్లి, వేలేరుపాడు, చండ్రుగొండ మండలాల్లో టీఆర్ఎస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బంద్ పాటించారు. భద్రాచలం నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో బంద్ నిర్వహించారు. బంద్ సందర్భంగా భద్రాచలంలోని వ్యాపార సముదాయాలు, హోటళ్లు, బ్యాంకులు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. దుమ్ముగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి ప్రత్యేక తెలంగాణా ఇప్పించాలంటూ పర్ణశాల రాముడి వద్ద వినతిపత్రం ఉంచారు. కొత్తగూడెం నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. సినిమాహాళ్లు, బ్యాంకులు, విద్యాసంస్థలు, పెట్రోల్‌బంక్‌లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. కొత్తగూడెంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సూపర్‌బజార్ సెంటర్ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెంలో సింగరేణి గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. పాల్వంచలో ఏపీ జెన్కో, జేఏసీ ఆధ్వర్యంలో కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. మధిర నియోకవర్గంలోని మధిర, బోనకల్లు, చింతకాని, ఎర్రుపాలెం, ముదిగొండ మండల కేంద్రాల్లో బంద్ నిర్వహించారు. మధిరలో రాయల తెలంగాణను నిరసిస్తూ టీఆర్ఎస్, బీజెపీ, ఎమ్మార్పీఎస్, సీపీఐ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు మూసివేయించారు. పాలేరు నియోజకవర్గంలో బంద్ సందర్భంగా గురువారం తెలంగాణావాదులు రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్‌రోడ్‌లో టీఆర్ఎస్, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయుడుపేట చౌరస్తాలో టీజేఏసీ, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. నాయకన్‌గూడెంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. నేలకొండపల్లిలో బీజేపీ,టీజేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఇల్లెందులో హోటళ్లు, సినిమా హాళ్లు, దుకాణాలు మూసివేశారు. టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, టీఆర్ఎల్డీ, పీడీఎస్‌యూ, ఎన్డీ రాయల, చంద్రన్న వర్గాలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాలలో బంద్ ప్రశాంతంగా జరిగింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టీఆర్ఎస్, సీపీఐ, న్యూడెమోక్రసీ, బీజేపీ, ఇతర జేఏసీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బంద్ సంపూర్ణంగా జరిగింది. బూర్గంపాడు మండలంలో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ చేశారు. అనంతరం మండలంలోని సారపాక, బూర్గంపాడులలో ధర్నా రాస్తారోకో చేశారు. -
తెలంగాణ బంద్ విజయవంతం : కోదండరామ్
హైదరాబాద్: ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ బంద్ 100 శాతం విజయవంతమయిందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. తెలంగాణ జిల్లాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని తెలిపారు. 500 మందికి పైగా తెలంగాణావాదులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిజాం కాలేజ్‌లో 200మందిని అరెస్ట్ చేసి గోషామహల్‌కు తరలించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి ఓయూ యూనివర్శిటీ లోపలికి పోలీసులు ప్రవేశించారని తెలిపారు. లాఠీఛార్జీలు, అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమైక్య ముసుగులో సీమాంధ్ర పాలకులు, సీఎం నేతృత్వంలో చేసే కుట్రలను తిప్పికొడదామని పిలుపు ఇచ్చారు. గాయపడిన వారందరికి ప్రభుత్వమే వైద్య సాయం అందించాలని డిమాండ్ చేశారు. నిజాం హాస్టల్ పైనుండి విద్యార్ధి దూకితే కాలు విరిగినా ఆంబులెన్స్‌ను పిలవలేదని మండిపడ్డారు. మరో రెండు మూడు రోజుల్లో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని కోదండరామ్ చెప్పారు.