breaking news
public organizations
-
బంద్ సంపూర్ణం
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ వెనుకబడిన తరగతుల ఐక్య కార్యాచరణ సమితి (బీసీ జేఏసీ) శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఈ బంద్‌లో పాల్గొనడంతో జనజీవనం స్తంభించింది. ఎక్కడా హింసాత్మక ఘటనలు లేకుండా బంద్ ప్రశాంతంగా ముగిసింది. ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తుగా సెలవు ప్రకటించగా... వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ప్రకటించారు. తెల్లవారుజాము నుంచే బీసీ జేఏసీ నేతలు, పార్టీల నాయకులు బస్సు డిపోలు, బస్స్టాండ్ల ఎదుట బైఠాయించారు. అన్ని జిల్లాల్లోనూ నాయకులు బంద్ విజయవంతానికి సహకరించారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఎంజీబీఎస్, జేబీఎస్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని బస్‌డిపోల వద్ద నిరసన కార్యక్రమాలతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగినప్పటికీ... బస్సులు లేకపోవడంతో విద్యార్థులు హాజరు కాలేదు. మరోవైపు జేఏసీ నేతలు వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి బంద్ పాటించాలని కోరుతూ వాటి కార్యకలాపాలను అడ్డుకున్నారు. ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు. జనాభా ప్రాతి పదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలని నినదించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని పక్షాల మద్దతుతో సంపూర్ణ బంద్ జరగడం ఇదే తొలిసారి. అధికార, ప్రతిపక్షాలు అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఈ బంద్‌లో పాల్గొనడం గమనార్హం. ⇒ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమంలో జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, వందలాది బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, బీసీ ఉద్యమ గీతాలతో ఆటపాటలు, ధూమ్‌ధామ్ నిర్వహించారు. ⇒ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడతామని పలువురు మంత్రులు నినదించారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్‌తోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్‌కుమార్, సాట్స్ చైర్మన్ శివసేనరెడ్డి పాల్గొన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు మద్దతు పలికాయని తెలిపారు. కానీ, బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు మద్దతు అంటూ కేంద్రంలో మాత్రం వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. ⇒ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను అడ్డుకుంటోందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆయన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో నిర్వహించిన బంద్‌లో పాల్గొన్నారు. ⇒ మంత్రి కొండా సురేఖ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు బంద్‌లో పాల్గొన్నారు. ఆమె రిజర్వేషన్లపై అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తొక్కిపెట్టిన బీజేపీకి ››బీసీల పాపం తగులుతుందన్నారు. ⇒ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌యాదవ్, ముఠాగోపాల్, గంగుల కమలాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బంద్‌లో పాల్గొన్నారు. పార్లమెంట్లో బిల్లు పెట్టి షెడ్యూల్ 9లో చేరిస్తేనే చట్టబద్దత వస్తుందని తెలిసీ కూడా జీవో తీసుకుని ఎన్నిలకు వెళ్లేలా నోటిఫికేషన్ ఇచ్చి, న్యాయస్థానాలు కొట్టేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. ⇒ సికింద్రాబాద్‌లో నిర్వహించిన బీసీ బంద్‌లో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని మద్దతు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రపు కమిషన్లు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. దిల్సుఖ్నగర్ డిపో వద్ద జరిగిన నిరసన కార్యక్రమం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. బస్సులు రోడ్డెక్కకుండా అడ్డుకునేందుకు బీసీ జేఏసీ నేతలు యత్నించగా పోలీసులు వారిని నిలువరించేందుకు చేసిన చర్యలతో తోపులాట చోటుచేసుకుంది. ⇒ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరన్వహించిన మానవహారంలో కల్వకుంట్ల కవితతోపాటు ఆమె కుమారుడు పాల్గొన్నారు. ⇒ బంద్‌కు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నారాయణగూడ నుంచి కోఠి వరకు జరిగిన ర్యాలీలో సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఎ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, న్యూ డెమోక్రసీ అధికారప్రతినిధి జేవీ చలపతిరావు, పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ పి.సంధ్య, పీడీఎస్‌యూ నాయకులు మహేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. =ఎల్బీనగర్ చౌరస్తాలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, టి.చిరంజీవులు పాల్గొన్నారు. ప్రయాణికుల పాట్లు... రాష్ట్ర బంద్ నేపథ్యంలో బస్‌డిపోలు, బస్టాండ్ల వద్ద నిరసన కార్యక్రమాలు జోరందుకోవడంతో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీపావళి పండుగ పురస్కరించుకుని ఊళ్లకు వెళ్లేవారు, రోజువారీ జీవనోపాధి కోసం ప్రయాణించే వాళ్లు బస్సుల కోసం బస్టాండ్ల వద్ద పడిగాపులు కాశారు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకున్న ప్రైవేటు వాహనదారులు రెట్టింపు డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. చాలాచోట్ల ఆటోలు, టాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనదారులు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 4గంటల తర్వాత బస్సులు రోడ్డెక్కడంతో ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం వాణిజ్య సముదాయాలు తెరుచుకున్నాయి. బంద్ విజయవంతం: ఆర్.కృష్ణయ్య హిమాయత్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, గ్రామాల్లో బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ విజయవంతమైందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. ఈ బంద్‌కు అన్ని పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతిచ్చాయని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో మీడియా సమావేశంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ విజీఆర్ నారగోని, కో–ఛైర్మన్ దాసు సురేశ్, కో–ఆర్డినేటర్ గుజ్జ కృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. స్కూళ్లు, కళాశాలలు, ఆర్టీసీ ఉద్యోగులు, 135 కులసంఘాలు, ప్రతి ఒక్కరూ బీసీ బంద్‌లో పాల్గొన్నారని పేర్కొన్నారు. బీసీల ఆకాంక్షల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలన్నారు. 76 ఏళ్ల నుంచి బీసీలకు మోసం జరుగుతూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం లాగా, సాగర హారం, మిలియన్ మార్చ్ లాంటి కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. చట్ట సభల్లో తమ రిజర్వేషన్లు సాధించే వరకు తెగించి పోరాడుతాం అని స్పష్టం చేశారు. -
బాధ్యత మరచి.. బాధితురాలి పేరు చెప్పి
అనంతపురం టవర్‌క్లాక్: బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కనీస అవగాహన లేకుండా అత్యాచార బాధితురాలి పేరు చెప్పడంపై ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 14 మంది టీడీపీ కీచకులు దళిత బాలికపై అత్యాచారం చేయగా.. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దళిత బాలికను పరామర్శించేందుకు గురువారం అనంతపురం వచ్చిన రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో అత్యాచారానికి గురైన బాధితురాలి పేరును శైలజ పదేపదే ప్రస్తావించారు. దీంతో ఆమె తీరును జర్నలిస్టులు తప్పుపట్టారు. అత్యాచారానికి గురైన బాలిక పేరు చెప్పకూడదంటూ నిబంధన ఉందని ఆమెకు గుర్తు చేశారు. గతంలో అత్యాచారానికి గురైన బాలిక పేరు చెప్పారంటూ మాజీ ఎంపీ మాధవ్‌పై కేసు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌పైన కూడా కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఆమెను అడ్డుకొని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో గిరిజన విద్యార్థిని తన్మయి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని వారు మండిపడ్డారు. దళిత బాలికపై సామూహిక అత్యాచారం విషయంలోనూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోకపోతే.. ఉద్యమిస్తామని హెచ్చరించారు.భయపడడం వల్లే హత్యలు, అత్యాచారాలు..మహిళలు, బాలికలు భయపడటం వల్లే హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండాలనిని సూచించారు. ఏ కష్టం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గిరిజన విద్యార్థిని తన్మయి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదన్నారు. అయినా పోలీసులపై ఆరోపణలు రావడంతో సీఐను సస్పెండ్ చేశామన్నారు. బాధిత కుటుంబాలకు తగిన సాయం చేస్తామన్నారు. -
ప్రభుత్వంపై ప్రజాసంఘాల మండిపాటు
సాక్షి, విజయవాడ : నగరంలోని ఎంబీ భవన్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో మద్య వ్యతిరేక ఉద్యమ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నేతలు, వక్తలు ప్రభుత్వంపై మండిపడ్డారు. మద్యపానాన్ని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయంటూ విమర్శించారు. మద్యాన్ని రాష్ట్రం ఆదాయ వనరుగా చూస్తోందని, పేదల ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదని వక్తలు మండిపడ్డారు. ఇకనైన ప్రభుత్వం మద్యం పట్ల తన వైఖరి మార్చుకోవాలంటూ హితవు పలికారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా బెల్టుషాపులు యధేచ్ఛగా కొనసాగుతున్న ప్రభుత్వ చర్యలు శూన్యమనని విమర్శించారు. ఇకనైనా బెల్టుషాపులను అరకట్టాలని వారు డిమాండ్ చేశారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలు లక్షల కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి, ఏపీ మహిళా సంఘం కార్యదర్శి దుర్గా భవానీ, కార్పొరేటర్ అవుతు శైలజ పాల్గొన్నారు. -
బీసీసీఐ ప్రజా సంస్థే: లా కమిషన్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి మింగుడు పడని నిర్ణయాన్ని లా కమిషన్ తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఈ క్రికెట్ బోర్డు ప్రజా సంస్థ అని తేల్చింది. సమాచార హక్కు (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం లా కమిషన్ సిఫారసులను ఆమోదిస్తే, ఆర్టీఐ చట్టపరిధిలోకి బోర్డు వస్తే... కోర్టుల్లో ఇక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) వెల్లువెత్తుతాయి. జట్ల సెలక్షన్, ఆటగాళ్లను ఏ ప్రాతిపదికన తీసుకున్నారని పిల్ దాఖలు చేసే అవకాశాలుంటాయి. జస్టిస్ బి.ఎస్.చౌహాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న లా కమిషన్... బోర్డు, ఆటగాళ్లకు అందుతున్న పురస్కారాలను ఈ సందర్భంగా విశ్లేషించింది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు తమ జెర్సీలపై త్రివర్ణాలను, హెల్మెట్లపై అశోక ధర్మచక్రాన్ని ప్రముఖంగా ధరిస్తున్నారని, వారు సాధించిన ఘనతలకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారాలను, పన్ను మినహాయింపులను, ప్రోత్సాహకాలను అందిస్తోందని... కాబట్టి దీన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్‌గా చూడలేమని, ప్రభుత్వ సంస్థే అవుతుందని కమిషన్ తమ సిఫారసులో పేర్కొంది. -
ఇదేంటి వెంకటరమణా..?
- తిరుమల బైపాస్ రోడ్డులో బార్లను నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు - ఆ మార్గంలో బార్లకు అనుమతించాలంటూ సర్కారుపై ఎమ్మెల్యే ఒత్తిడి..! - భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ప్రజాసంఘాల ఆగ్రహం సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మద్యం ఏరులై పారుతుండటం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. తిరుపతిలో మద్యం అమ్మకాలను నిషేధించి.. భక్తుల మనోభావాలను కాపాడాలన్న ప్రజాసంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. కనీసం తిరుపతిలోనైనా మద్యాన్ని నిషేధించాలంటూ భారీ ఎత్తున పోరాటాలు చేసినా సర్కారు ఖాతరు చేయలేదు. ఖజానాను నింపుకోవడానికి భక్తుల మనోభావాలను తాకట్టు పెడుతోంది. ఈ నేపథ్యంలో కనీసం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో.. అంటే రైల్వేస్టేషన్, విష్ణునివాసం, ఆర్టీసీ బస్టాండు, శ్రీనివాసం, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్(తిరుమల బైపాస్ రోడ్డు) వరకూ మద్యం దుకాణాలు, బార్లను నిషేధించాలనే డిమాండ్ భక్తుల నుంచి వచ్చింది. ఆ డిమాండ్‌కు కూడా స్పందించకపోవడంతో ప్రజాసంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఉత్తర్వుల మేరకు గతేడాది తిరుమల బైపాస్ రోడ్డులో మద్యం దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటుచేయలేదు. కానీ.. ఆ మార్గంలో తొమ్మిది బార్లకు లెసైన్సులు మాత్రం ఇచ్చింది. తిరుమల బైపాస్ రోడ్డులో బార్లను కూడా అనుమతించకూడదంటూ ప్రజాసంఘాలు మరోసారి కోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు ఈ అంశం కోర్టు విచారణలో ఉంది. దీంతో తిరుపతి బైపాస్ రోడ్డులోని తొమ్మిది బార్ల లెసైన్సులను ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. మిగతా పదిబార్లకు రెన్యువల్ చేసింది. ఆ తొమ్మిది బార్ల లెసైన్సుదారులు ఎమ్మెల్యే వెంకటరమణకు ప్రధాన అనుచరులు. సార్వత్రిక ఎన్నికల్లో వెంకటరమణ విజయానికి వీరు భారీ ఎత్తున ఖర్చుచేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్మును రాబట్టుకునేందుకు బార్ల లెసైన్సుదారులు ఎమ్మెల్యే వెంకటరమణపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన వెంకటరమణ తిరుమల బైపాస్ రోడ్డులో తొమ్మిది బార్లకు అనుమతించాల్సిందేనంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. సోమవారం ఇదే అంశంపై హైదరాబాద్‌లో ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులతో భేటీ కావడం గమనార్హం. దేవదేవుడు కొలువైన తిరుమలకు వెళ్లే మార్గంలో మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటుచేయడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనంటూ ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా తిరుమల బైపాస్ రోడ్డులో బార్లు ఏర్పాటుచేస్తే ఉద్యమాలు తప్పవని ప్రజాసంఘాలు హెచ్చరిస్తున్నాయి. కానీ ఇవేవీ ఎమ్మెల్యే వెంకటరమణ పట్టించుకోకపోవడం గమనార్హం. తన అనుచరులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా తిరుమల బైపాస్ రోడ్డులో తొమ్మిది బార్లకు లెసైన్సులు ఇప్పించేందుకు పోరాటం చేస్తోండటం కొసమెరుపు.


