
నదీ గర్భంలో మూడెకరాలు ఆక్రమించి భారీ వెంచర్
ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని మంచిరేవులలో శ్రీ ఆదిత్య హోమ్స్ నిర్వాకం
యథేచ్ఛగా ఎన్‌ఓసీలు జారీ చేసిన వివిధ విభాగాలు
ఎగువన పలు ప్రాంతాలకు పెరిగిన ముంపు ముప్పు
ఆక్రమణలను గుర్తించిన హైడ్రా.. ప్రాథమిక విచారణ పూర్తి చేసిన అధికారులు
చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్న కమిషనర్ రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: మూసీనదిని మూసేసి అడ్డంగా నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) నార్సింగి ఎగ్జిట్ సమీపంలోని మంచిరేవులలో శ్రీ ఆదిత్య హోమ్స్ నిర్మించిన వాంటేజ్ వెంచర్‌పై సమగ్ర విచారణ జరుపుతోంది. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం ఈ సంస్థ మూసీ నదీ గర్భంలో దాదాపు మూడు ఎకరాలు కబ్జా చేసినట్లు గుర్తించింది. ఈ వ్యవహారంపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు.
ఓఆర్‌ఆర్‌లో భూమి పోవడంతో..
శ్రీ ఆదిత్య హోమ్స్ సంస్థ మంచిరేవులలో వెంచర్ నిర్మించడానికి గతంలో దాదాపు పది ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అయితే, అందులోని ఆరు ఎకరాలను ఓఆర్‌ఆర్, సర్వీసు రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించింది. కానీ, రికార్డుల్లో మాత్రం రెండు ఎకరాలను మాత్రమే సేకరించినట్లు చూపారు. ఇక్కడే భూ యజమాని తెలివిగా ఆలోచించి పక్కనే ఉన్న మూసీపై కన్నేశాడు. భూసేకరణలో రెండు ఎకరాలు మాత్రమే పోయినట్లు చూపించి మూసీ నదీగర్భంలోకి చొరబడి ఏకంగా మూడు ఎకరాలను ఆక్రమించాడు. దీనిపై వివిధ విభాగాల నుంచి ఎన్‌ఓసీలు.. హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకున్న శ్రీ ఆదిత్య సంస్థ వాంటేజ్ నిర్మాణాన్ని చేపట్టింది.
అంతకు ముందే మూసీ నదిలో ఓ రిటైనింగ్ వాల్ నిర్మించింది. అది వివాదాస్పదం కావడంతో హెచ్‌ఎండీఏ వాంటేజ్ నిర్మాణానికి అనుమతులను రద్దు చేసింది. దీంతో రిటైనింగ్ వాల్‌ను కూల్చేసిన శ్రీ ఆదిత్య సంస్థ.. అనుమతుల రద్దును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లింది. న్యాయస్థానం నుంచి అనుకూలంగా ఆదేశాలు పొంది యధేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తోంది. ఈ కబ్జాపై కొన్నేళ్లుగా ఫిర్యాదులు అందుతున్నా.. ఏ అధికారి కూడా వాంటేజ్ జోలికి వెళ్లలేదు. కొన్ని నెలలుగా ఈ నిర్మాణంపై ప్రజాప్రతినిధులతో పాటు స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి.
మ్యాప్స్‌తో కీలక ఆధారాలు
హైడ్రా బృందాలు వాంటేజ్ వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాయి. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోలు, విలేజ్ క్రెడెస్టియల్ మ్యాప్స్‌తోపాటు గూగుల్ హిస్టారికల్ శాటిలైట్ ఇమేజెస్‌ను అధ్యయనం చేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్నారెస్సీ) రూపొందించిన డిజిటల్ ఎలివేషన్ మోడల్ (డీఈఎం) మ్యాప్స్‌తో మూసీ పరీవాహక ప్రాంతాన్ని సరిచూశారు. దీంతో శ్రీ ఆదిత్య హోమ్స్ సంస్థ వాంటేజ్ కోసం మూసీలో మూడు ఎకరాలు కబ్జా చేసినట్లు తేలింది. దీనిపై మరికొన్ని ఆ«ధారాలు సేకరించిన తర్వాత ఆ సంస్థకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.
ఈ విషయంపై రంగనాథ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఉస్మాన్‌సాగర్ నుంచి ఇటీవల దిగువకు వదిలిన నీరు దాని సామర్థ్యంలో పావు వంతు మాత్రమే. ఆ వెంచర్ చేసిన కబ్జా కారణంగా ఆ నీరు కూడా దిగువకు వెళ్లలేక ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డును ముంచేసింది. ఉస్మాన్‌సాగర్ నుంచి పూర్తిస్థాయిలో నీరు విడుదలైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. నోటీసుల జారీచేసి చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం. చెరువులు, కుంటల కబ్జా కంటే మూసీ కబ్జా వల్ల నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది’అని పేర్కొన్నారు.
వరదలతో బండారం బట్టబయలు
ఇటీవల మూసీ పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో వాంటేజ్ టవర్స్‌లోకి భారీగా వరదనీరు వచి్చంది. ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు వదలటంతో మూసీలో ప్రవహించాల్సిన నీరు.. ఎంఎఫ్‌ఎల్‌తోపాటు బఫర్ జోన్ ఆక్రమణకు గురి కావడంతో ఓఆర్‌ఆర్ సరీ్వస్ రోడ్డును సైతం ముంచేసింది. ఎగువన అనేక ప్రాంతాలకు పొంచి ఉన్న ముంపు ముప్పును ఎత్తి చూపింది. దీంతో ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమగ్ర విచారణకు ఆదేశించారు.