‘దండుపాళ్యం’ పాలన ఎవరిదో అందరికీ తెలుసు | Minister Sridhar Babu Slams Opposition Parties | Sakshi
Sakshi News home page

‘దండుపాళ్యం’ పాలన ఎవరిదో అందరికీ తెలుసు

Oct 18 2025 7:58 PM | Updated on Oct 18 2025 8:05 PM

Minister Sridhar Babu Slams Opposition Parties
  • అసహనం, నిరాశతోనే మా ‘కేబినేట్’పై నిరాధారమైన ఆరోపణలు
  • వాళ్ల అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకునేందుకే మాపై కట్టుకథలు
  • గత పాలనా వైఫల్యాల చరిత్రను దాచేందుకే ఈ మైండ్ గేమ్
  • మా మంత్రులందరిదీ ఒకటే జెండా... ఒకటే అజెండా
  • గత 20 నెలల్లో రాష్ట్రానికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు
  • రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్‌: ‘దండుపాళ్యం’ పాలన అంటే ఎవరిదో అందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అందుకే గట్టిగా  కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు. అధికారం లేదన్న అసహనం, నిరాశలో ‘కేబినేట్’పై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను ఆయన శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 

మంత్రుల మధ్య కుమ్ములాటలు, కేబినేట్ సమావేశంలో వర్గాలుగా విడిపోయి గొడవలు పడ్డారంటూ కట్టుకథల్ని సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారంతా సినిమాల్లో ‘రచయితలు’ గా ప్రయత్నించాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినేట్ సమష్ఠిగా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేస్తుందని స్పష్టం చేశారు. 

భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో అహర్నిశలు శ్రమిస్తున్న మా మంత్రులకు ప్రత్యేకంగా వ్యక్తిగత అజెండా అంటూ ఏదీ లేదన్నారు. మాకు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలే మా అందరి అజెండా అని తేల్చి చెప్పారు. మేం వేసే ప్రతి అడుగు రాష్ట్రాభివృద్ధి కోసమేనని, ఈ విషయంలో ఎలాంటి అపోహాలకు తావు లేదని స్పష్టం చేశారు. ‘విలువ ఆధారిత వృద్ధే’ లక్ష్యంగా మా ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందన్నారు. మ

ేం పాలనను గాలికొదిలేస్తే గత 20 నెలల్లో రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవా అని ప్రశ్నించారు. మంత్రులంతా వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకుంటే "ఎలీ లిల్లీ" లాంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు  ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. 

మాది మాటల ప్రభుత్వం కాదని... చేతల్లో చేసి చూపించే ప్రజా ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మీ అంతర్గత కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి మాపై బురద చల్లడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. మీ అహంకారపూరిత వ్యవహారశైలి, పాలనా వైఫల్యాల చరిత్రను దాచుకునేందుకు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు మీ కుతంత్రాలను నమ్మరని గుర్తు చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

6 నెలల్లోనే రూ.12,864 కోట్ల ఎఫ్‌డీఐలు..
‘పారిశ్రామికాభివృద్ధి విషయంలోనూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్ డీఐ) ఆకర్షణలో తెలంగాణ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లోనే రాష్ట్రానికి రూ.12,864 కోట్ల ఎఫ్ డీఐలు వచ్చాయి. 2023–24లో ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోనే టాప్ – 3 అర్బన్ ఎఫ్ డీఐ కేంద్రాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. 

‘2023-24లో పరిశ్రమల జీఎస్ వీఏ రూ.2.46 లక్షల కోట్లు. అది 2024-25లో 12.6 శాతం పెరిగి రూ.2.77 లక్షల కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు 8.68 శాతం. గతేడాదితో పోలిస్తే 2.1 శాతం అధికంగా నమోదయ్యింది. అదే జాతీయ సగటు వృద్ధి రేటు 6.2 శాతం మాత్రమే’ అని పేర్కొన్నారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ప్రతిపక్షాలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement