
ఫాతిమా కాలేజీ వ్యవహారంపై వివరణ ఇచ్చిన హైడ్రా కమిషనర్
సాక్షి, హైదరాబాద్: ఫాతిమా కాలేజీ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. ఆ కళాశాల సూరం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న మాట వాస్తవమే అయినా, వేల మంది మైనార్టీ విద్యారి్థనుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే చర్యలకు వెనుకాడుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘ఫాతిమా ఒవైసీ ఉమెన్స్ కాలేజ్ అనేది అక్బరుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటీ సంస్థ. నిరుపేద మైనార్టీ బాలికలు, యువతులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. కొన్ని కోర్సులకు మాత్రం నామమాత్రపు ఫీజు ఉంది. ఈ కాలేజీలో ఏటా 10 వేల మందికి పైగా విద్యనభ్యసిస్తుంటారు. నిరుపేద మైనార్టీ యువతులకు విద్యనందించడం ద్వారా ఈ కాలేజీ సామాజిక వెనుకబాటుతనం నుంచి వారికి విముక్తి కల్పించడానికి ప్రయత్నిస్తోంది.
హైడ్రా ఎంఐఎం పట్ల ఉద్దేశపూర్వకంగా మెతకవైఖరిని అవలంబిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు చేసిన కొన్ని ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల పట్ల హైడ్రా కఠినంగా వ్యవహరించిందింది. గత ఏడాది ఆగస్టు 8న హైడ్రా చేపట్టిన మొదటి కూల్చివేత బమ్ రుక్ ఉద్ దౌలా చెరువులోని భవనాలే. ఇవి ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించినవే. 25 ఎకరాల చెరువును ప్లాట్లుగా మార్చిన కింగ్స్ గ్రూపు విక్రయిస్తోంది.
ఈ గ్రూపు యజమాని ఒవైసీ కుటుంబానికి చాలా కీలకమైన వ్యాపార భాగస్వామి. హైడ్రా ఇప్పుడు ఆ చెరువును అభివృద్ధి చేస్తోంది. చాంద్రాయణగుట్టలోని ప్రభుత్వ భూమిలో ఉన్న ఎంఐఎం కార్పొరేటర్లకు చెందిన అనేక వాణిజ్య దుకాణాలను తొలగించి ఆ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైడ్రా ఎవరి పట్లా మెతక వైఖరిని అవలంబించదు. సామాజిక కారణాల వల్ల మాత్రమే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేసింది. అన్నింటికీ ఒకే మంత్రం అనే తీరుతో ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తే అది సామాజిక, దేశ పురోగతికి గొడ్డలి పెట్టవుతుంది’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.