
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిమితి చిత్రాలు
సర్పంచ్‌గా పోటీచేయాలన్నా ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి
ఎన్నికల సంఘం పరిమితి మాత్రం రూ.2.5 లక్షల లోపే
సెల్ఫ్ డిక్లరేషన్‌పై అభ్యర్థులు జాగ్రత్తగా ఉండకపోతే అంతే..
సాక్షి, హైదరాబాద్: జమీన్ ఆస్మాన్ ఫరక్.. అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా అనేది నానుడి. గత కొన్నేళ్లలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం ఊహించలేనంతగా పెరిగిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి కూడా అలాగే తయారవుతోంది. స్థాని క ఎన్నికల్లో పోటీ చేయటం అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారుతోంది.
వార్డు సభ్యుడు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయాలంటే భూము లు ఇతర ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తోంది. ఎన్నికల సంఘం అభ్యర్థులకు విధిస్తున్న వ్యయ పరిమితికి, వాస్తవంగా చేస్తున్న ఖర్చుకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గ్రామ వార్డు సభ్యుడు మొదలు జెడ్పీటీసీ వరకు పోటీచేసే అభ్యర్థుల గరిష్ట ఎన్నికల ఖర్చు వివరాలు చూద్దాం..
గరిష్ట వ్యయపరిమితి (2011 జనాభా లెక్కల ప్రకారం..)
⇒ 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.30 వేల వరకే ఖర్చు చేయాలి.
⇒ 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.50 వేల వరకే ఖర్చు చేయాలి.
⇒ 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.
⇒ 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.2.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.
⇒ ఎంపీటీసీ అభ్యర్థి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.
⇒ జెడ్పీటీసీ అభ్యర్థి గరిష్టంగా రూ.4 లక్షల వరకే ఖర్చు చేయాలి.
అభ్యర్థులు చేయాల్సినవి...
⇒ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీచేసే వారు ఇద్దరు సాక్షులతో కూడిన తమ స్వీయ ప్రకటన (సెల్ఫ్ డిక్లరేషన్)ను నామినేషన్ పత్రంతో రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి.
⇒ అభ్యర్థులపై ఒకవేళ క్రిమినల్ కేసులు ఉంటే స్వీకరించిన కేసులు (కాగ్జినెన్స్ టేకన్) మాత్రమే రాయాలి.
⇒ శిక్ష పడిన కేసు వివరాలు రాయాలి.
⇒ అభ్యర్థి లేదా భాగస్వామి, అభ్యర్థిపై ఆధారపడిన వారి చర, స్థిరాస్తులు (విదేశీ ఆస్తులతో సహా) పొందుపరచాలి.
⇒ ఉమ్మడి ఆస్తిలోని వాటాను కూడా తెలపాలి.
⇒ ఉమ్మడిగా కలిగి ఉన్న భూములు, భవనాలు, ఆపార్ట్‌మెంట్ వివరాలు వేర్వేరుగా పొందుపరచాలి.
⇒ వ్యవసాయ భూమికి సంబంధిత భూమి సర్వే నంబర్, ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం, మొత్తం విస్తీర్ణం పొందుపరచాలి. వారసత్వమా కాదా అనేది కూడా తెలపాలి.
⇒ బాండ్లు,షేర్లు, డిబెంచర్ల విలువ, తత్సంబంధిత కంపెనీ స్టాక్ ఎక్సె్చంజీ జాబితాలో ఉంటే ప్రస్తుత మార్కెట్ విలువ, జాబితాలో లేని కంపెనీల వివరాలు పుస్తకాలలో పేర్కొన్న ప్రకారం చూపాలి.
⇒ ఆధారపడటం అంటే ఓ వ్యక్తి పూర్తిగా అభ్యర్థి ఆదాయంపైనే ఆధారపడినట్టు అర్థం.
⇒ ప్రతి పెట్టుబడి, ఎంత మొత్తంలో ఆ పెట్టుబడి పెట్టారో వివరాలు తెలపాలి.
⇒ చేతిలో నగదు, అభ్యర్థికి సంబంధించిన నగదు, భార్య/భర్తకు సంబంధించిన నగదు, ఆధారపడిన వారి వద్ద ఉన్న నగదు వివరాలు తెలియజేయాలి.
⇒ అభ్యర్థి, భార్య/భర్త, వారిపై ఆధారపడిన వారి బ్యాంకు ఖాతాలు, వాటిలో ఉన్న మొత్తం నిల్వ, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, అకౌంట్ నంబర్లు, ఏదైనా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు ఉంటే వాటి వివరాలు తెలపాలి.
⇒ అభ్యర్థి, భార్య/భర్త, వారిపై ఆధారపడిన వారికి ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాలు, ఇతర ఆభరణాలు వాటి బరువు ఒక్కొక్కటిగా పేర్కొనాలి.
⇒ అభ్యర్థి, భార్య/భర్తకు సంబంధించిన వృత్తి, వ్యాపార వివరాలు పొందుపరచాలి.
⇒ అభ్యర్థికి సంబంధించిన విదార్హతల సర్టిఫికెట్లు, కోర్సు పూర్తి చేసిన సంవత్సరం, ఇతర వివరాలు ఇవ్వాలి.
⇒ అభ్యర్థుల స్వీయ ప్రకటనను ఇద్దరు సాక్షులతో సంతకాలు చేయించి, వారి పూర్తిపేరు, చిరునామా స్పష్టంగా రాయకపోతే నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది.