రైతులేమైనా బిక్షగాళ్లా..? | Sakshi
Sakshi News home page

రైతులేమైనా బిక్షగాళ్లా..?

Published Sun, Aug 6 2023 5:11 AM

Telangana: Bandi Sanjay Visit Karimnagar District - Sakshi

శంకరపట్నం (మానకొండూర్‌)/రామడుగు(చొప్పదండి): భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్ట్‌ గండిని పరిశీలించారు. గండి పడటానికి దారితీసిన కారణాలను డీఈ కవితను అడిగి తెలుసుకున్నారు. అనంతరం  విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ.3వేల కోట్ల సాయం చేసిందన్నారు.

అయితే అందులో సగం నిధులను దారిమళ్లించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 30 వేల ఎకరాలు, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 7వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. రోడ్లు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, 50 ఏళ్లనాటి కల్వల ప్రాజెక్ట్‌కు గండిపడితే అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించలేదని మండిపడ్డారు.

‘రైతు లేమైనా భిక్షగాళ్లు అనుకుంటున్నవా? ప్రతీసారి చేయిచాచి సాయం చేయాలని అడుక్కోవాలా? వారిని ఆదుకోని ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత’అని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కాగా, ఆగ మేఘాలపై ఆర్టీసీ బిల్లును పంపి గవర్నర్‌ సంతకం చేయలేదంటే ఎలా? ఆ బిల్లులో ఏమైనా లోపాలు ఉన్నాయా? న్యాయపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలన చేయకుండానే సంతకం పెట్టమంటే ఎలా? అని సంజయ్‌ ప్రశ్నించారు.  

నివేదికలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం.. 
భారీవర్షాలతో దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఆస్తి నష్టాలు తెలుసుకునేందుకు కేంద్రబృందం పరిశీలనకు వస్తే ప్రభుత్వం నివేదికలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని బండి సంజయ్‌ విమర్శించారు.

Advertisement
 
Advertisement