అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం

Mar 7 2026 7:28 AM | Updated on Mar 7 2026 7:28 AM

ప్రగతి ప్రణాళిక సక్సెస్‌ చేద్దాం

ఉమ్మడి జిల్లాను అగ్రపథాన నిలుపుదాం

ప్రధాన సమస్యలు పరిష్కరించుకుందాం

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కరీంనగర్‌ను ఆదర్శంగా నిలుపుదాం: మంత్రి పొన్నం ప్రభాకర్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/కరీంనగర్‌ అర్బన్‌:

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మార్గదర్శకత్వంలో 99 రోజులపాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని వ్యవసాయ, సహకారశాఖ, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నిలుపుతామని పేర్కొన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం ఉమ్మడి జిల్లా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశం జరగగా మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పెద్దపల్లి ఎంపీ ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు అడిషనల్‌ కలెక్టర్లు అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్లు చిత్రామిశ్రా, గరిమా అగర్వాల్‌, కోయ శ్రీహర్ష, సత్యప్రసాద్‌ ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీకి సంబంధించిన పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రధాన సమస్యల పరిష్కారం, రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. వ్యవసాయ రంగానికి రూ.లక్ష కోట్లు బడ్జెట్‌ కేటాయించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు ముందుండి నడిపించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

● రాజకీయాలకతీతంగా ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కరీంనగర్‌ జిల్లా ఆదర్శంగా నిలవాలన్నారు. సమర్థవంతంగా నిర్వహించేలా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇండ్లలో శిథిలావస్థలో ఉన్న టీవీలు కంప్యూటర్లు ఇతర వస్తువులను ఈ వేస్ట్‌ విధానం ద్వారా సేకరించాలని సూచించారు. ‘సురక్షితంగా చేరుకోండి’ అనే నినాదంతో ఏప్రిల్‌ 13 నుంచి 18 వరకు హోంశాఖ, రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

● ఆరు గ్యారంటీల అమలు ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో మానవ వనరుల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. తాగునీరు, డంప్‌ యార్డు సమస్యను పరిష్కరించాలని కరీంనగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ కోరారు. పలు పెండింగ్‌ పనులను ప్రస్తావించారు.

● ప్రజలకు నమ్మకాన్ని కల్పించడంలో ప్రభుత్వం సక్సెస్‌ సాధిస్తోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. విద్యా విధానంలో వినూత్న మార్పులు, సంక్షేమ రంగంలో సత్ఫలితాలు సాధించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. 99 రోజులపాటు ప్రజల వద్దకే పాలన చేపట్టడం వల్ల ప్రజలకు మరింత భరోసా కల్పిస్తున్నామని అన్నారు.

● ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మంచి కార్యక్రమమని రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్‌ మక్కాన్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. రామగుండం సింగరేణి ప్రాంతం బొగ్గు గనులు, ఎన్టీపీసీకి దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. గోదావరిఖనిలో 500 మందికి ఇటీవల ఇండ్ల పట్టాలు అందించామని ఇందులో 50 మంది ట్రాన్స్‌జెండర్లకు అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని పేర్కొన్నారు.

● 99 రోజులపాటు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమం అద్భుతమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల అభివృద్ధి లక్ష్యంగా పాటుపడుతోందన్నారు.

● వేలాది మంది రైతులకు కల్పతరువైన కల్వల ప్రాజెక్ట్‌ ఆధునీకరణకు మంత్రులు ప్రత్యేక చొరవ చూపాలని హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి కోరారు. వీణవంకలో రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విన్నవించారు.

● కరీంనగర్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ విజ్ఞప్తి చేశారు. రహదారిపై సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిపై ప్రత్యేక దృష్టి సారించి యుద్ధప్రాతిపదిగిన కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

● కోరుట్లలో మిగిలిపోయిన హాస్పిటల్‌, పాఠశాలల పనులు త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మంత్రులకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలు వంతెన నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని విన్నవించారు.

● సైబర్‌ క్రైం మోసగాళ్ల ఆట కట్టించేందుకు పోలీస్‌ అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ రావు కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణ పద్ధతులు అవలంబించాలని కోరారు.

● నారాయణపూర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు మంత్రులు ప్రత్యేక చొరవ చూపాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి చేశారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాలువ పనులు పూర్తి చేసేందుకు రూ.20కోట్లు విడుదల చేయాలని కోరారు. గతంలో రూ.23కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కరీంనగర్‌– జగిత్యాల నేషనల్‌ హైవే రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. చొప్పదండిలో సెంట్రల్‌ లైటింగ్‌ వర్క్‌ వేగవంతం చేయాలని కోరారు. కొండగట్టు అభివృద్ధికి నిధులు బడ్జెట్లో కేటాయించాలని, సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సత్యం కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement