జపాన్ భాగస్వామ్యంతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం
జీహెచ్‌ఎంసీకి 86 ఎకరాల బదిలీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో చెత్త సమస్యలకు పరిష్కారంగా.. ఘన వ్యర్థాల నిర్వహణను మరింత ఆధునిక సాంకేతికతతో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌లో 86 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయనున్న ఎకోటౌన్ ప్రాజెక్టులో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు ఇచ్చిన అనుమతికి తాజాగా అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈమేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ జీఓ జారీ చేశారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వం, జపాన్‌లోని ప్రిఫెక్చర్‌కు చెందిన కిటాక్యూషూ నగరం మధ్య కుదిరిన స్నేహ, సహకార ఒప్పందంలో భాగంగా అమలు కానుంది.
విజ్ఞప్తికి స్పందించి..
నగరాల్లో సర్క్యులర్ ఎకానమీ విధానాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెట్ జీరో లక్ష్యాల సాధన కోసం ఎకోటౌన్‌ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సిద్ధాపూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 252, 278, 361లోని 150 ఎకరాల భూమిని బదిలీ చేయాల్సిందిగా గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ టీజీఐఐసీని కోరారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన పరిశ్రమలు, వాణిజ్యశాఖ.. సిద్ధాపూర్‌లోని 86 ఎకరాల టీజీఐఐసీ భూమిని జీహెచ్‌ఎంసీకి ఉచితంగా బదిలీ చేసేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరి 11న అడ్వాన్స్ పొజిషన్ సర్టిఫికెట్ ద్వారా ఈ భూమిని జీహెచ్‌ఎంసీకి అప్పగించారు.
హెచ్‌ఐఎంఎస్‌డబ్ల్యూకు వ్యర్థాల నిర్వహణ బాధ్యతలు..
86 ఎకరాల స్థలంలో ఘనవ్యర్థాల నిర్వహణ సదుపాయాలు కలి్పంచేందుకు వీలుగా హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (హెచ్‌ఐఎంఎస్‌డబ్ల్యూ) సంస్థకు ‘క్యూర్’ స్పెషలాఫీసర్ ఇదివరకే అనుమతులిచ్చారు. ఆ అనుమతుల్ని పరిశీలించిన ప్రభుత్వం ఇప్పుడు ధ్రువీకరిస్తూ జీఓ జారీ చేసింది. సంబంధిత చట్టాలు, నిబం«ధనలు ,ప్రభుత్వ ఉత్తర్వులు, ఇంటిగ్రేటెడ్ మున్సిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు ఒప్పంద నిబంధనల ప్రకారమే ప్రాజెక్టును అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు మరింత బలం..
ఎకో టౌన్ ప్రాజెక్టు అమల్లోకి వస్తే హైదరాబాద్‌లో ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు మరింత బలం చేకూరడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, వనరుల పునరి్వనియోగం, సుస్థిర నగరాభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారంగానూ.. నగరం నలు వైపులా ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం తెలిసిందే.


