మంచిర్యాల జిల్లా: సెలవు రోజు కావడం.. బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో మంచిర్యాలకు చెందిన దంపతులు, ఒక్కగానొక్క కొడుకుతోపాటు నానమ్మను తీసుకుని వెళ్లారు. శుభకార్యం అనంతరం సాయంత్రం తిరిగి ఇంటికి బయల్దేరారు. రోడ్డుపక్కన ఆగిఉన్న లారీ రూపంలో మృత్యువు కాపు కాచింది. కారు వెనుకనుంచి లారీని ఢీకొట్టడంతో కొడుకు తల మొండెం వేరయ్యాయి. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. జైపూర్ ఎస్సై భూమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్షెట్టిపేటకు చెందిన పద్మ–కృష్ణమోహన్ దంపతులు.
వీరికి ఇంటర్ పూర్తిచేసిన వెంకటసాయి సుశీల్(18) కొడుకు ఉన్నాడు. పద్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ప్రస్తుతం మంచిర్యాలలో నివాసం ఉంటున్నారు. ఆదివారం వారి దగ్గరి బంధువులు పెద్దపల్లిలో శుభకార్యం ఏర్పాటు చేశారు. పద్మ,–కృష్ణమోహన్ దంపతులతోపాటు కుమారుడు వెంకటసాయి సుశీల్, కృష్ణమోహన్ తల్లి ఉదయలక్ష్మితో కలిసి సొంత కారులో ఉదయం వెళ్లారు. శుభకార్యం అనంతరం అందరూ తిరిగి మంచిర్యాలకు బయల్దేరారు. ఇందారం క్రాస్ దాటి ఎన్‌హెచ్ 63పైకి చేరుకున్నాక, రోడ్డుపక్కన ఓ లారీ నిలిపి ఉంది. కారు నడుపుతున్న కృష్ణమోహన్ వేగంగా వెళ్లి లారీని వెనుకనుంచి ఢీకొట్టాడు. కారు వేగం ఎక్కువగా ఉండడంతో ప్రమాదం ధాటికి కారులో ఎడమవైపు కూర్చున్న వెంకటసాయి సుశీల్ తల, మొండెం వేరయ్యాయి.
వెనుక సీటులో ఎడమవైపు కూర్చున్న ఉదయలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణమోహన్, పద్మ స్వల్పంగా గాయపడ్డారు. అప్పటి వరకు తల్లిదండ్రులతో సరదాగా కబుర్లు చెబుతూ వచి్చన ఒక్కగానొక్క కొడుకు సుశీల్ రెప్పపాటులో విగతజీవిగా మారాడు. భయంకరమైన ఆ దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. కారులో వెంకటసాయి సుశీల్ మృతదేహం ఇరుక్కుపోవడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. సుమారు అరగంటపాటు శ్రమించి వెలికి తీశారు. గాయపడిన ఉదయలక్ష్మి, పద్మ, కృష్ణమోహన్‌ను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని జైపూర్ సీఐ నవీన్‌కుమార్ సందర్శించారు. పద్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భూమేశ్ తెలిపారు.


