సాక్షి, నిజామాబాద్: కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌లో పార్టీ క్రమశిక్షణ, నేతల మధ్య సమన్వయం, నామినేటెడ్ పదవుల అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు, చిన్నారెడ్డి వ్యవహారం, పోచారం అసంతృప్తితో పాటు ప్రతిపక్ష నేత హరీశ్ రావు రాసిన లేఖపైనా తాజాగా ఆయన స్పందించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. మంత్రి పదవిలో ఉన్నందునే ఆమె నుంచి వివరణ కోరినట్లు చెప్పారు. వివరణ వచ్చిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరూ పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిందేనని మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. సీనియర్ నేత చిన్నారెడ్డిపై ప్రస్తావన వచ్చిన సందర్భంలోనూ ఇదే విధానం వర్తిస్తుందని చెప్పారు. పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎవరైనా ముందుగానే ప్రకటించినా అవి చెల్లుబాటు కావని తెలిపారు.
పార్టీలో అభ్యర్థుల ఎంపికకు ఒక నిర్దిష్టమైన విధానం ఉందని చెప్పారు. ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) నిర్ణయాల మేరకే అభ్యర్థులను ఖరారు చేస్తామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
హరీశ్‌రావు లేఖపై..
బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు రాసిన లేఖపై కూడా పీసీసీ చీఫ్ స్పందించారు. 22ఏ అంశంపై బీఆర్‌ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. కింది స్థాయిలో ఏదైనా తప్పిదం తమ దృష్టికి వస్తే లోపాలను సరిదిద్దాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. తప్పిదం జరిగిందని సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటించి, దాన్ని సరిదిద్దే చర్యలు తీసుకున్నారని చెప్పారు. 22ఏ నిబంధన వల్ల భూదందాలకు, భూముల అన్యాక్రాంతానికి అవకాశం ఉండదని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా సామాన్యులకు అన్యాయం జరిగితే నేరుగా గాంధీభవన్ తలుపులు తట్టవచ్చని అన్నారు.
పోచారంతో మాట్లాడాం
సీనియర్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా మహేష్ గౌడ్ స్పందించారు. ఆయనతో ఇప్పటికే మాట్లాడామని, ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నామని చెప్పారు. కాంగ్రెస్‌లో సీనియర్ నేతలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలకు 70 శాతం పదవులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాన్సువాడలో పాత, కొత్త నేతలను కలుపుకొని ముందుకు సాగుతామని చెప్పారు.
పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ సిద్ధాంతాలకు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా ఉన్నారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీలో ‘పచ్చ నేతలు’ ఎవరూ లేరని, పాత–కొత్త నేతల కలయికతో పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే..
కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మహేష్ గౌడ్ అన్నారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. నేతల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉన్నా వాటిని పార్టీ అంతర్గతంగా పరిష్కరించుకుంటామని, పార్టీని బలహీనపరిచేలా బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
కొండా రిప్లైపై ఆసక్తి
గతంలో సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి అదే పని చేయడంతో.. ఆమె వ్యాఖ్యలపై దుమారం రేగింది. పరకాలలో తానే పోటీ చేయబోతున్ననానని.. కాబోయే ఎమ్మెల్యేనని ప్రకటించుకున్నారామె. దీంతో.. రేవూరి వర్సెస్ కొండా ఫ్యామిలీ వివాదం తెర మీదకు వచ్చింది. ఈ పరిణామంపై అధిష్టానం సీరియస్ అయ్యింది. కూతురి వ్యాఖ్యలపై మూడ్రోజుల్లో వివరణ ఇవ్వాలని కొండా సురేఖను షోకాజ్ నోటీసుల్లో ఆదేశించింది. దీంతో కుమార్తె సుస్మిత వ్యాఖ్యలను సమర్థిస్తారా? ఆమె ఏం వివరణ ఇవ్వబోతున్నారో అనే ఆసక్తి నెలకొంది. సాయంత్రం ఆమె ఓ లేఖ ద్వారా వివరణ ఇవ్వొచ్చని సమాచారం అందుతోంది.


