హైదరాబాద్: ‘జీడిమెట్లకు చెందిన వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలను వీక్షిస్తూ, ఇతరులకు షేర్ చేస్తున్నట్లు అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ) సంస్థ గుర్తించింది. వెంటనే ఆ సమాచారాన్ని సైబర్ టిప్‌లైన్ ద్వారా జాతీయ నేర నమోదు రికార్డ్‌ల బ్యూరో (ఎన్‌సీఆర్బీ)కు తెలియజేసింది. అక్కణ్నుంచి రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగానికి ఆ సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు నిందితుడి ఐపీ అడ్రస్ ద్వారా ఫోన్ నంబరు, లొకేషన్‌ను గుర్తించి అరెస్టు చేశారు’.. ఆన్‌లైన్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినా, షేర్ చేసినా, డౌన్‌లోడ్ చేసుకున్నా ఎంత ప్రమాదమో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
ఏమీ తెలియదనుకోవడం అమాయకత్వమే..
ఫోన్ ప్రైవేటే కావచ్చు.. కానీ, ఇంటర్నెట్ మాత్రం కచ్చితంగా పబ్లిక్. నాలుగు గోడల మధ్య కూర్చొని, ఆన్‌లైన్‌లో పిల్లల అశ్లీల కంటెంట్ చూస్తేనో, డౌన్‌లోడ్ చేసుకుంటేనో, డిలీట్ చేస్తేనో ప్రపంచానికి ఏమీ తెలియదనుకోవడం పొరపాటే. ఇంటర్నెట్‌లో మనం చేసే ప్రతి క్లిక్, వ్యూ, డౌన్‌లోడ్, షేరింగ్ శాశ్వతంగా రికార్డ్ అవుతుంది. గ్లోబల్ అల్గారిథమ్‌లు, ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్‌లు మన ప్రతి డిజిటల్ అడుగులను నమోదు చేసి, పసిగట్టేస్తుంటాయి. అమెరికాకు చెందిన ఎన్‌సీఎంఈసీ అనే నిఘా సంస్థ సామాజిక మాధ్యమాల్లోని అశ్లీల కంటెంట్‌ను నిరంతరం ట్రాక్ చేస్తూ.. పోలీసులను అప్రమత్తం చేస్తుంది.
1–7 ఏళ్ల వరకూ జైలు శిక్ష..
పిల్లల అశ్లీల చిత్రాలు చూసినా, ఎవరికైనా పంపించినా ఐటీ చట్టం 67 బీ కింద కేసులు నమోదు చేస్తారు. చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ సేకరించినా, భద్రపరుచుకున్నా పోక్సో చట్టం సెక్షన్–15 కింద నేరమే. నిందితులకు జరిమానాతో పాటు గరిష్టంగా 1–7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
ఎలా గుర్తిస్తారు?
మెటా, గూగుల్ వంటి సంస్థలు ఫొటో డీఎన్‌ఏ అనే ప్రత్యేక సాంకేతికను ఉపయోగిస్తుంటాయి. ఇది అశ్లీల చిత్రాలను, వీడియోకు ఒక ప్రత్యేకమైన ‘హ్యాష్ వ్యాల్యూ’ ఇస్తుంది. ప్రైవేట్ చాట్‌లలో షేర్ చేసినా ఈ అల్గారిథమ్ దాన్ని వెంటనే గుర్తిస్తుంది. కంటెంట్ ఫ్లాగ్ అయిన వెంటనే వినియోగదారు ఐపీ అడ్రస్, ఏ సమయంలో యాక్సెస్ చేశారు. వీటి ఆధారంగా స్థానిక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ) ద్వారా ఫోన్ నంబరు, నివాస చిరునామాను పోలీసులు త్వరితగతిన సేకరిస్తారు. నిందితుడి మొబైల్, ల్యాప్‌టాప్‌లను జప్తు చేసి డిలీట్ చేసిన ఫైళ్లను కూడా డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా రీస్టోర్ చేస్తారు. నిందితుడు ఏయే గ్రూప్‌లలో ఉన్నారు? కంటెంట్ ఎవరికి షేర్ చేశారో సోషల్ మీడియా సంస్థల ద్వారా సేకరిస్తారు.


