హైదరాబాద్: తెలంగాణలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో కమ్యూనిటీ శునకం మృతికి సంబంధించి కేసు నమోదైంది. భద్రతా సిబ్బందిలో ఒకరు కుక్కపై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై పెటా ఇండియా, స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఇండియా (ఎస్‌ఏఎఫ్‌ఐ)జోక్యంతో సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
సెప్టెంబర్ 27న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఓ భద్రతా సిబ్బంది కమ్యూనిటీ కుక్కను కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో కుక్క తీవ్రంగా గాయపడినట్లు పెటా ఇండియా, ఎస్‌ఏఎఫ్‌ఐ తెలిపాయి. తీవ్ర గాయాలతో బాధపడిన ఆ కుక్క రెండు రోజుల తర్వాత, సెప్టెంబర్ 29న మృతి చెందినట్లు పేర్కొన్నాయి. కుక్క మృతిపై సెప్టెంబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 1న గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఎస్‌ఏఎఫ్‌ఐ ఫౌండేషన్ క్రూరత్వ నిరోధక విభాగం మేనేజర్ అడులాపురం గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఎఫ్‌ఐఆర్ నమోదైన రోజే మృతిచెందిన కుక్కకు పోస్టుమార్టం నిర్వహించారు. సంగారెడ్డి రూరల్ సర్కిల్ సీఐ మహమ్మద్ నయీముద్దీన్, సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అర్వ హారిక కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసును భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), 2023లోని సెక్షన్ 325 కింద నమోదు చేసినట్లు పెటా ఇండియా తెలిపింది. జంతువును చంపడం, విషప్రయోగం చేయడం, గాయపరచడం వంటి చర్యలను ఈ నిబంధన కింద నేరంగా పరిగణిస్తారు. నేరం రుజువైతే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని పెటా సంస్థ పేర్కొంది. జంతువులపై క్రూరత్వానికి పాల్పడిన ఘటనలను పోలీసులకు తెలియజేయాలని పెటా ఇండియా ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: ఒక రోజు పసిపాప.. గొంతు నులిమి హత్య


