న్యాయ వ్యవస్థకే తలవంపులు | Pulivarthi Nani Allegedly Threatens Retired District Judge Sparks Legal Outrage | Sakshi
Sakshi News home page

న్యాయ వ్యవస్థకే తలవంపులు

Jul 2 2026 8:03 AM | Updated on Jul 2 2026 8:12 AM

 Pulivarthi Nani Allegedly Threatens Retired District Judge Sparks Legal Outrage

టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని వ్యాఖ్యలపై భగ్గుమన్న న్యాయ వర్గాలు

ఒక రిటైర్డ్‌ జడ్జిని బూతులతో దూషించడం దారుణం

నానిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదుల డిమాండ్‌

సీఎం చంద్రబాబు మౌనంపై న్యాయ వర్గాల్లో అసహనం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు అంతే లేకుండాపోతోంది. అవినీతి, అక్రమాలతో పాటు కనిపించిన భూమినల్లా ఆక్రమిస్తూ సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్న పచ్చ మూకలు ఇప్పుడు న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం విస్తుగొలుపుతోంది. తెలుగుదేశం పార్టీ నేతల్లోనే ఆక్రమణలకు, అవినీతికి, దౌర్జన్యాలకు మారుపేరుగా మారిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని ఓ విశ్రాంత జిల్లా జడ్జిని అత్యంత జుగుప్సాకరంగా బూతులు తిడుతూ, అంతు చూస్తానంటూ బెదిరించడంపై న్యాయ వర్గాలు మండి పడుతున్నాయి.

గౌరవ ప్రదమైన జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన న్యాయాధికారిని ఈ విధంగా బూతులు తిడుతూ మాట్లాడటంపై అటు విశ్రాంత న్యాయాధికారులు, ఇటు న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని భూ ఆక్రమణ­లను ప్రశ్నించినందుకు రిటైర్డ్‌ జడ్జిని బూతులు తిడుతూ బెదిరించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. నానిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. న్యాయవ్యవస్థ అంటే తమకు అపార గౌరవమని తరచూ చెప్పే చంద్రబాబు నాయుడు.. తమ పార్టీ నేతలు ఈ విధంగా న్యాయ వ్యవస్థపై దాడి చేస్తుంటే మౌనంగా చూస్తూ ఉండటాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. 

సీఎం తీరు చూస్తుంటే ఈ వైఖరిని ప్రోత్సహిస్తున్నట్లుందని తప్పు పడుతున్నారు. నానిపై చర్యలు తీసుకోవాల్సిందేనని, లేని పక్షంలో ఆందోళనకు సైతం వెనుకాడబోమని హెచ్చరిస్తు­న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ను విమర్శించినా, తప్పులను ఎత్తిచూపినా వెంటనే అరెస్ట్‌ చేయిస్తున్న ప్రభుత్వానికి.. పులివర్తి నాని బూతులు, బెదిరింపులు వినిపించకపోవడం విశేషం.   

ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ న్యాయమూర్తులే లక్ష్యం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ పచ్చ మూకలు న్యాయమూర్తులపై దుష్ప్రచారం చేస్తూ చెలరేగి­పోయాయి. చంద్రబాబుకు లేదా తెలుగుదేశం పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చినా, తీర్పులు ఇచ్చినా సహించలేని పచ్చ ముఠాలు సోషల్‌ మీడియా వేదికగా దూషణలు సాగించాయి. స్కిల్‌ కుంభకోణంలో చంద్రబాబుకు రిమాండ్‌ విధించిన మహిళా న్యాయాధికారిని అత్యంత జుగుప్సాకరంగా, అసభ్య పదజాలంతో కొన్ని నెలలపాటు దూషిస్తూ వచ్చాయి. అలాగే కొందరు హైకోర్టు న్యాయమూర్తు­లను సైతం వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దారు­ణంగా దుష్ప్రచారం సాగించారు. వీటిని హైకోర్టు న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండించింది.  

నానికి కొమ్ముకాస్తున్న టీడీపీ పెద్దలు 
వృద్ధ దంపతులు దశాబ్దాల క్రితం కష్టపడి కొనుక్కున్న భూమిని అన్యాయంగా ఆక్రమించుకోవడమే కాకుండా, దానికి అడ్డుపడిన వారిపై అధికార బలంతో పులివర్తి నాని విరుచుకు­పడ­టం, అతనికి అధికార పార్టీ పెద్దలు కొమ్ము కాయడం రాజకీయ దురహంకారానికి పరాకాష్టగా న్యాయ­వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఆ వృద్ధ దంపతుల తరఫు­న కేసు వాదించేందుకు ముందుకొచ్చిన రిటైర్డ్‌ జడ్జిపై అధికార పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని వాడిన పదజా­లం వింటే.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేక రౌడీల రాజ్యంలో ఉన్నామా.. అనే అనుమానం కలగక మానదు. జడ్జిలకు, న్యాయ­వాదులకు రక్షణ లేకపోతే, ఇక సామాన్య పౌరుడి గతి ఏమిటనే ప్రశ్న ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు భూ కబ్జాలు చేస్తూ, మరోవైపు అడ్డు వచ్చిన వారిని బెదిరించడం అధికార పార్టీ నేతలకు పరిపాటిగా మారింది. ప్రజల ఆస్తులనే దోచుకుంటూ, ప్రశ్నించిన వారిని బెదిరించడం బాబు పాలనలోని నియంతృత్వ ధోరణిని సూచిస్తోందని న్యాయవర్గాలు అంటున్నాయి.

న్యాయ వ్యవస్థను కించపరచడమే
పులివర్తి నాని అసభ్యకర దూషణలు, బెది­రింపులు న్యాయ వ్యవస్థను కించపరచడమే. ఇది కోర్టు ధిక్కారం కూడా. రిటైర్డ్‌ జడ్జిని తిట్టినా, పద­విలో ఉన్న జడ్జిని తిట్టినా.. అది క్షమించరాని నేరం. హైకోర్టు దీనిపై సుమో­టోగా చర్యలు చేపట్టాలి. రిటైర్డ్‌ జడ్జికి రక్షణ కల్పించాలి.
– జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి 

అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇంత అసహనమా?
ఎమ్మెల్యే పులివర్తి నాని చర్యలు ముమ్మా­టికీ న్యాయ వ్యవస్థను కించపరిచేవే. జడ్జిగా గౌరవప్రద బాధ్య­తలు నిర్వర్తించి, పదవీ విరమణ చేసిన తర్వా­త న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూ.. బాధితులకు అండగా నిలవ­డం తప్పా? అలాంటి వ్యక్తిని దూషిం­చడం, బెదిరించడం అధికార దురంహకారానికి పరాకాష్ట. ఇది అధికార పార్టీ నేతల నిజ స్వరూపాన్ని సూచిస్తోంది. నానిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.
– ఎస్‌.శరత్‌ కుమార్, సీనియర్‌ న్యాయవాది

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement