జనగామ: పట్టణంలోని నైన్ డైన్ రెస్టారెంట్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. రెస్టారెంట్ యాజమాన్యం, కస్టమర్ మధ్య ప్రారంభమైన చిన్నపాటి వివాదం పరస్పర దాడులకు దారితీయడంతో పరిస్థితి చేయిదాటే అవకాశం ఏర్పడింది. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణరెడ్డి వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
అర్ధరాత్రి ప్రాంతంలో ఘటన జరగగా ఆ సమయంలో పోలీసు వాహనానికి డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో సీఐ సత్యనారాయణరెడ్డి స్వయంగా వాహనం నడుపుకుంటూ అక్కడికి చేరుకున్నారు. ఘర్షణలో గాయపడిన ఇద్దరిని సైతం సీఐ తన వాహనంలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ఘటనపై సమాచారం అందుకున్న ఎస్‌ఐ చెన్నకేశవులు పోలీసు సిబ్బందితో కలిసి రెస్టారెంట్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనకు సంబంధించి నైన్‌డైన్ రెస్టారెంట్ యజమానితో పాటు మరో వ్యక్తి, పలువురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఘర్షణకు దారితీసిన కారణాలు, ఇరువర్గాల పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు.


