జనగామ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాలాపన, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఛాగల్లు రోడ్డు ప్రమాద మృతుడు పరకాల వాసి
స్టేషన్‌ఘన్‌పూర్: ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో జాతీయ రహదారిపై యూటర్న్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేటకు చెందిన బయ్య సిద్దు(20)గా గుర్తించారు. సిద్దు తండ్రి రాజు మూడేళ్ల క్రితం చనిపోయాడు. తల్లి శ్రీలత, సోదరి ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ రాంచరణ్ అజాగ్రత్తగా రాంగ్‌రూట్‌లో అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని, ట్రాక్టర్ డ్రైవర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిద్దు బాబాయి ఫిర్యాదులో కోరారు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు.
చికిత్స పొందుతున్న మహిళ మృతి
రఘునాథపల్లి: తీవ్ర కడుపునొప్పి భరించలేక పురుగు మందు తాగిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలోని ఖిలాషాపూర్‌లో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన బాల్నె ఉపేంద్ర (58), భర్త వెంకటేశ్వర్లు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉపేంద్ర మూడు నెలలుగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోంది. 14న రాత్రి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
పాడిగేదెలు అమ్ముకున్న బాధతో ఆత్మహత్య
జఫర్‌గఢ్: ఇష్టంగా పెంచుకుంటున్న పాడి గేదెలు అమ్ముకున్నానన్న బాధతో మండలంలోని తమ్మడపల్లి (ఐ) గ్రామంలో బొల్లాల మోహన్(42) అనే రైతు పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులతో పాడిగేదెలను అమ్ముకున్న మోహన్ తీవ్ర మనోవేధనతో 13న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.


