● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్: నియోజకవర్గ కేంద్రంలో రూ.46 కోట్ల నిధులతో నిర్మాణం జరుగుతున్న వంద పడకల ఆస్పత్రిని డిసెంబర్ 31, 2026 నాటికి పూర్తి చేసి జనవరి 2027 నాటికి అన్ని హంగులతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈసీజీ మిషన్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం ప్రారంభించారు. అనంతరం స్వయంగా ఎమ్మెల్యే ఈసీజీ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘన్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి ఈసీజీ మిషన్ అందుబాటులోకి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఘన్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నారని, త్వరలో డయాలసిస్ సెంటర్ మంజూరు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్యారాణి, ప్రజాప్రతినిధులు, నాయకులు, వైద్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ రేషన్‌కార్డులు అందిస్తోందని, కార్డు కల్గిన ప్రతీ కుటుంబం తప్పనిసరిగా డిజిటల్ రేషన్‌కార్డులను తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జరుగుతున్న గ్రామసభకు ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ ముక్కెర స్వరూపరవి, ఉపసర్పంచ్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.


