వేషం మార్చి.. మోసం గుట్టు విప్పి.. | Police in disguise caught those were targeting and defrauding farmers: TS | Sakshi
Sakshi News home page

వేషం మార్చి.. మోసం గుట్టు విప్పి..

Jun 6 2025 5:22 AM | Updated on Jun 6 2025 5:22 AM

Police in disguise caught those were targeting and defrauding farmers: TS

రైతు వేషధారణలో బ్యాంకు వద్ద రైతులతో ముచ్చటిస్తున్న పోలీసు అధికారి (మధ్యలో ఉన్న వ్యక్తి)

రైతులను మోసం చేస్తున్న దళారులపై పోలీసుల నిఘా 

రైతుల వేషంలో బ్యాంకుల వద్దకు వెళ్లి వివరాల సేకరణ 

ఆదిలాబాద్‌ జిల్లాలో పోలీసుల ఆపరేషన్‌  

సాక్షి, ఆదిలాబాద్‌: బ్యాంకుల్లో పంటరుణాలు ఇప్పించేందుకు కమీషన్‌ వసూలు చేస్తున్న దళారుల దందాను ఆదిలాబాద్‌ జిల్లా పోలీసులు తెలివిగా బట్టబయలు చేశారు. కమీషన్‌ దందాపై ఫిర్యాదులు రావటంతో జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదేశాల మేరకు పలు బ్యాంకుల వద్దకు పోలీస్‌ ఉన్నతాధికారులే రైతుల వేషంలో వెళ్లి ఆరా తీశారు. రుణాల కోసం వచ్చిన రైతులతో మాట కలిపి దళారుల దోపిడీ గురించి వివరాలు సేకరించారు.  

రుణాన్ని బట్టి కమీషన్‌: వ్యవసాయ సీజన్‌లో ఏటా రైతులకు బ్యాంకులు పంట రుణం ఇస్తుంటాయి. తర్వాతి పంట సీజన్‌లో పాత అప్పునకు సంబంధించి వడ్డీతో సహా చెల్లిస్తే కొత్త రుణాన్ని కొంత పెంచి ఇస్తాయి. ఇక్కడే దళారులు రంగప్రవేశం చేశారు. రైతులు తీసుకున్న రుణాలను వారే వడ్డీతో సహా బ్యాంకులో చెల్లించి, తిరిగి రైతులకు అధిక రుణం వచ్చేలా చేస్తున్నారు. ఆ వచ్చే రుణం నుంచి తాము కట్టిన రుణం మొత్తంతోపాటు అదనంగా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు కమీషన్‌ తీసుకుంటున్నారు.

ఈ అంశంపై ఫిర్యాదులు రావటంతో పోలీసులు బుధవారం రైతుల వేషంలో బ్యాంకుల వద్దకు వెళ్లి సమాచారం సేకరించారు. గుడిహత్నూర్, ఉట్నూర్, నార్నూర్, బేల, భీంపూర్, మావల, ఇంద్రవెల్లి మండలాల్లో ఇలాంటి దళారులు 34 మందిపై ఆయా పోలీసుస్టేషన్లలో బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 318 కింద చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement