నల్లగొండ: కన్నకూతురే రాసిన రక్తచరిత్ర ఇది! | Nalgonda Haseena family case: shocking truth emerges | Sakshi
Sakshi News home page

నల్లగొండ: కన్నకూతురే రాసిన రక్తచరిత్ర ఇది!

Jun 25 2026 11:36 AM | Updated on Jun 25 2026 12:16 PM

Nalgonda Haseena family case: shocking truth emerges

నల్లగొండ పట్టణాన్ని కుదిపేసిన నాలుగు హత్యల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం కన్నకూతురు, అల్లుడే.. హసీనా కుటుంబాన్ని దారుణంగా హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను నియమించారని.. ఆ గ్యాంగ్‌ అత్యంత కిరాకతంగా ఆ నలుగురిని హతమార్చిందని తేల్చారు.

నల్లగొండ జిల్లాలో సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో నాలుగు హత్యల ఘటన మిస్టరీ వీడింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దారుణ ఘటనలో హసీనా అనే మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ముగ్గురు ఘోరంగా హత్యకు గురయ్యారు. మొదట ఇది గుర్తుతెలియని దుండగుల దాడిగా అనుమానించగా.. దర్యాప్తు ముందుకు సాగిన కొద్దీ కేసు షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. హసీనా పేరుపై ఉన్న ఆస్తుల విషయంలో కుటుంబంలో తీవ్ర వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆస్తులు తనకు దక్కడం లేదన్న అక్కసుతోనే ఆమె కూతురు(మొదటి భర్త ద్వారా జన్మించిన సంతానం), అల్లుడు కలిసి ఈ హత్యలకు పథకం వేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణానికి వారు హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన ఓ సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దించారు.

దర్యాప్తులో మరో కీలక కోణం వెలుగులోకి వచ్చింది. ఘటనకు కొన్ని రోజుల ముందే నిందితులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి లోపలికి వెళ్లే మార్గాలు, కుటుంబ సభ్యుల కదలికలు అన్నీ ముందుగానే గమనించి పక్కా ప్లాన్‌తో హత్యలకు పాల్పడ్డారని సమాచారం.

ఘటన జరిగిన రాత్రి.. నిందితులు ఇంటి తలుపు తట్టి హసీనాను బయటకు రప్పించినట్లు సమాచారం. తలుపు తెరిచిన వెంటనే ఆమెపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. హసీనా కుమారుడు ముజమ్మీల్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతనిపైనా తీవ్రంగా దాడి చేసి గొంతు కోసి, ఆపై కత్తితో పొడిచి హతమార్చారు.

ఆ అలజడికి మెలుకువ వచ్చి వచ్చిన సుల్తాన్‌పై(హసీనా మూడో భర్త) కూడా దుండగులు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసినట్లు తేలింది. దాడి సమయంలో భయంతో బెడ్ కింద దాక్కున్న సుల్తాన్ కుమార్తె అక్సరాను బయటకు లాక్కొచ్చిన దుండగులు.. గోడకేసి బలంగా బాదారు. అనంతరం కత్తులతో పొడిచి హతమార్చారు.

దర్యాప్తు ప్రకారం, ఈ మొత్తం కుట్రలో సుపారీ గ్యాంగ్ సహా మొత్తం ఎనిమిది మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న కూతురు, అల్లుడి సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

ఇదే కేసులో మరో కీలక అంశంగా, హత్యలకు ఉపయోగించిన ఆయుధాలను ఘటన అనంతరం వివిధ ప్రాంతాల్లో దాచినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో దాడి ఎంత క్రూరంగా జరిగిందో వివరాలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

హసీనా(40)కు గతంలో రెండు వివాహాలు జరిగాయి. సుల్తాన్‌ను మూడో వివాహం చేసుకున్నారు. ఇక సుల్తాన్‌కు కూడా హసీనా మూడో భార్య. మొదటి భార్య ద్వారా కలిగిన సంతానం ముజమ్మీల్, అక్సరాలతో ఆ భార్యభర్తలు కలిసే ఉంటున్నారు. హసీనా పేరు మీద కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇల్లులు ఉన్నాయి. ఆ ఆస్తిని సుల్తాన్ పిల్లల మీద వీలునామా రాస్తున్నట్లు హసీనా చెప్పడంతో కక్ష పెంచుకొని, హసీన మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement