కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఆయన
అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు
అయినా ఓడిపోవడంతోనే ఈసీ పనితీరుపై
అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
ఢిల్లీలో విపక్షాల ర్యాలీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ‘ఆంధ్రప్రదేశ్‌లో గత 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో చూశాం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకుండా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు ఓడిపోయారు? అందుకే ఎన్నికల సంఘం పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..’అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన విపక్షాల ర్యాలీలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో టీడీపీ, జనసేన ఆఖర్లో కూటమి కట్టాయని గుర్తుచేశారు.
కేంద్ర ఎన్నికల సంఘంలో పెద్ద కుట్ర జరుగుతోంది
తెలంగాణలో తాము బలంగా ఉన్నాం కాబట్టే ఈ సారి 73 లక్షల ఓట్లు అక్రమంగా తీసేయడానికి కుట్ర పన్నారని, తాము మళ్లీ గెలుస్తామని తెలుసు కాబట్టే ఓట్లను గల్లంతు చేస్తున్నారని కోమటిరెడ్డి అన్నారు. దేశంలో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘంలో పెద్ద కుట్ర జరుగుతోందని, దీన్ని తిప్పికొడతామని స్పష్టం చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వ్యవహారశైలి ఎంత వివాదాస్పదమైందో, ఆయన ఏకపక్ష నిర్ణయాలపై తోటి ఎన్నికల కమిషనర్లు కేవలం పది నెలల వ్యవధిలోనే 14 సార్లు రికార్డు పూర్వకంగా ఎందుకు అభ్యంతరం చెప్పారో ప్రజలంతా గమనించాలని కోరారు. భారతదేశ ఎన్నికల చరిత్రలో గతంలో ఎప్పుడూ ఇంతటి దారుణమైన పరిస్థితులు లేవని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: సుప్రీం దిశగా సమరభేరీ


