2030 కంటే ముందే స్వదేశీ బ్రహ్మోస్‌ | Indigenous Brahmos before 2030 in India | Sakshi
Sakshi News home page

2030 కంటే ముందే స్వదేశీ బ్రహ్మోస్‌

Jun 21 2026 6:10 AM | Updated on Jun 21 2026 6:10 AM

Indigenous Brahmos before 2030 in India

ప్రస్తుతం 85 శాతం విడిభాగాలు భారత్‌లో తయారీ

పూర్తిస్థాయి దేశీ క్షిపణిని మూడేళ్లలోనే అభివృద్ధి చేయగలం 

డెవలప్‌మెంట్,డిజైన్‌ తయారీలో హైదరాబాద్‌ కీలకపాత్ర  

తెలంగాణ, ఏపీలో కొత్త ప్లాంటుకు స్థలం చూశాం

‘సాక్షి’తో బ్రహ్మోస్‌ డైరెక్టర్‌ జనరల్‌ జైతీర్థ్‌ ఆర్‌.జోషి  

సాక్షి, హైదరాబాద్‌: బ్రహ్మోస్‌.. ఆపరేషన్‌ సిందూర్‌లో లక్ష్యాన్ని ఛేదించి శత్రువుకు నిద్రలేని రాత్రులు చూపించిన.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ మిస్సైల్‌. భారత్‌–రష్యా సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. దీనిని భూమి, సముద్రం, జలాంతర్గామి, యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశించి ప్రయోగిస్తే.. ఇది స్వయంచాలకంగా టార్గెట్‌ను ధ్వంసం చేస్తుంది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా చాలా తక్కువ ఎత్తులో దూసుకుపోవడం దీని ప్రత్యేకత. ఇలాంటి క్షిపణుల తయారీలో హైదరాబాద్‌ సైతం కీలకంగా వ్యవహరిస్తోందని బ్రహ్మోస్‌ డైరెక్టర్‌ జనరల్, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సీఈవో, ఎండీ జైతీర్థ్‌ ఆర్‌. జోషి తెలిపారు. ఎన్‌డీఈ–2026 సదస్సు వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటైన సమావేశంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

నూరు శాతం దేశీయంగా.. 
బ్రహ్మోస్‌ క్షిపణుల తయారీకి అవసరమైన 85 శాతం విడిభాగాలను దేశీయంగా సమకూర్చుకుంటున్నాం. కొన్ని ఎలక్ట్రానిక్‌ విడిభాగాల విషయంలో వెనుకబడ్డాం. సెమీకండక్టర్‌ పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం. నూరు శాతం తయారీ దేశీయంగా సాధ్యమే. 2030 కంటే ముందే ఈ కల సాకారం అవుతుంది. కాన్సెప్ట్‌ రెడీ అయితే మూడేళ్లలోనే సరికొత్త బ్రహ్మోస్‌ క్షిపణిని అభివృద్ధి చేయగల సత్తా మనకు ఉంది. ఈ మేరకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) పూర్తిస్థాయి సామర్థ్యం సొంతం చేసుకుంది. ప్రస్తుతం సంస్థ వద్ద 6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.56 వేల కోట్లు) విలువైన ఆర్డర్‌ బుక్‌ ఉంది. ఇప్పటికే బ్రహ్మోస్‌ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు సరఫరా చేస్తున్నాం. వియత్నాంకు అతి త్వరలోనే అందించనున్నాం. ఈ క్షిపణుల కోసం పశ్చిమ, తూర్పు ప్రాంతంలోని చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. రష్యా సైతం అడుగుతోంది. 10 రోజుల్లో ఒక క్షిపణిని తయారు చేయగలం. 

20 శాతం హైదరాబాద్‌ నుంచే.. 
బ్రహ్మోస్‌ ఇండస్ట్రి కన్సార్షియంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 200కుపైగా చిన్న, మధ్యతరహా కంపెనీలున్నాయి. బ్రహ్మోస్‌ క్షిపణుల తయారీలో వాడే విడిభాగాలను ఈ కన్సార్షియంలో ఉన్న కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. మిసైళ్ల అసెంబ్లింగ్‌లోనూ ఇవి పాలుపంచుకుంటున్నాయి. కన్సార్షియంలోని 20 శాతం కంపెనీలు హైదరాబాద్‌ నుంచే ఉంటాయి. భాగస్వామ్య కంపెనీలకు సాంకేతిక బదిలీ, నిపుణులకు శిక్షణ ఇస్తున్నాం. హైదరాబాద్, నాగ్‌పూర్, పిలానీ, లక్నో వద్ద సంస్థకు తయారీ కేంద్రాలున్నాయి. 4 యూనిట్లలో మూడవ షిఫ్ట్‌ మొదలుపెట్టబోతున్నాం. బ్రహ్మోస్‌ ప్రాజెక్టులో డిజైన్, డెవలప్‌మెంట్, తయారీలో హైదరాబాద్‌ అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది.  

తెలంగాణలో సర్వే పూర్తి.. 
కొత్త ప్లాంటుకు 400–500 ఎకరాలు అవసరం. ఏపీ ప్రభుత్వం చూపించిన స్థలం అనువైనది కాదు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర వద్ద సర్వే పూర్తి చేశాం. ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే. ప్లాంటు ఏర్పాటు ముఖ్యం కాదు. అందుకు అవసరమైన ఎకో సిస్టమ్‌ ప్రధానం. వాస్తవానికి ఈ రంగంలో దేశవ్యాప్తంగా మానవ వనరుల కొరత చాలా ఉంది. ఇండియన్‌ సొసైటీ ఫర్‌ నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌ (ఐఎస్‌ఎన్‌టీ) వచ్చే నవంబర్‌లో నాన్‌ డిస్ట్రక్టివ్‌ ఇవాల్యుయేషన్‌ (ఎన్‌డీఈ)–2026, ఏరోఎన్‌డీటీ–2026 సదస్సులను నిర్వహిస్తోంది. 15–17 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమాలకు హైటెక్స్‌ వేదిక. దేశ, విదేశాల నుంచి రక్షణ, వైమానిక, ఇంధన, తయారీ రంగాలకు చెందిన 2వేల మంది నిపుణులు పాలుపంచుకోనున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement