హైద‌రాబాద్‌లో తరచూ ఇక్క‌డే యాక్సిడెంట్లు | Hyderabad Road Accidents Spots full details | Sakshi
Sakshi News home page

హైద‌రాబాద్‌లో 49 ప్రమాదకర ప్రాంతాలు

Jun 19 2026 7:55 PM | Updated on Jun 19 2026 8:19 PM

Hyderabad Road Accidents Spots full details

2023–25 గణాంకాల ఆధారంగా నిర్ధారణ

398 ఘటనల్లో 279 మంది దుర్మరణం

సాక్షి, హైద‌రాబాద్‌: నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు బ్లాక్‌స్పాట్స్‌పై దృష్టి సారించారు. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో 2023–25 మధ్య నిర్వహించిన అధ్యయనం ఆధారంగా 49 ప్రాంతాల్లో బ్లాక్‌స్పాట్స్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మూడేళ్లలో 398 ప్రమాదాలు జరగ్గా.. 279 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆయా చోట్ల ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సంబంధిత విభాగాలకు లేఖలు రాశారు.  

జాతీయ రహదారులపైనే అత్యధికం..  
నగర ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో కేవలం కొన్నింటిలో మాత్రమే బ్లాక్‌స్పాట్స్‌ లేవని తేలింది. అత్యధిక ఠాణాల పరిధిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్‌స్పాట్లు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తం 49 బ్లాక్‌స్పాట్స్‌లో 26 జాతీయ రహదారుల పైనే ఉన్నాయని ట్రాఫిక్‌ విభాగం అధికారులు గుర్తించారు. ఎన్‌హెచ్‌ నం.44పై 11, ఎన్‌హెచ్‌ నం.65పై 13 ఉండగా.. ఎన్‌హెచ్‌ నం.765, 163లపై ఒకొక్కటి చొప్పున ఉన్నాయి. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు సహా ఇతర రహదారులపై మిగిలినవి ఉన్నట్లు ట్రాఫిక్‌ పోలీసుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  

అనేకం ‘చావు’రస్తాలే... 
నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో అత్యధికం చౌరస్తాలు, జంక్షన్లే. రద్దీ వేళలు,  సిగ్నళ్లు యాక్టివ్‌గా ఉండే సమయంలో కంటే మిగిలిన సమయాల్లోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ 49 బ్లాక్‌స్పాట్స్‌లో 40 శాతం చౌరస్తాల్లో ఉన్నవే. ఆయా ప్రాంతాలు సైతం హైదరాబాద్‌–సైబరాబాద్‌–మల్కాజిగిరి సరిహద్దుల్లో కొన్ని ఉండటం గమనార్హం. వీటిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో మరణించిన/క్షతగాత్రులైన వారిలో పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులే ఎక్కువగా ఉన్నారు.  

ప్రమాదాలకు కారణాలివే 
పరిమితికి మించిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపటం 
మలుపులున్న చోట్ల డివైడర్లు, మీడియమ్స్‌ లేకపోవడం 
అత్యంత సమస్యాత్మకంగా (బ్‌లైండ్‌) ఉన్న మలుపులు 
కీలక సూచనలు చేసే సైనేజ్‌ బోర్డులు లేకపోవడం 
ఇరుకైన రోడ్లు, ఆపై అక్కడే ఉంటున్న ఆక్రమణలు 
రోడ్‌ ఇంజినీరింగ్‌ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం 
రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు 
క్యారేజ్‌ వేలో తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు 
అవసరమైన స్థాయిలో విద్యుత్‌ దీపాలు లేకపోవడం 
వాహనచోదకులు రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ చేయడం 
నో–ఎంట్రీల్లోకి వాహనాలతో దూసుకుపోవడం 
 రోడ్‌ మార్కింగ్‌ పక్కగా లేకపోవడం, శాస్త్రీయత కొరవడటం

చ‌ద‌వండి: బుడ్డోడి స‌ర‌దా.. లగ్జరీ కారు గోవిందా! 

గ్రే స్పాట్లే కీలకం 
బ్లాక్‌ స్పాట్స్‌తో పాటు గ్రే స్పాట్స్‌ గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వాలి. తరచూ ప్రమాద ప్రాంతాలు బ్లాక్‌ స్పాట్స్‌ కిందికి వస్తే.. ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్నవి గ్రే స్పాట్స్‌. గ్రే స్పాట్లను గుర్తించి ముందే చర్యలు తీసుకుంటే ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడవచ్చు.  
– ఎం.ప్రకాష్‌ కుమార్, రవాణా రంగ నిపుణుడు    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement