సాక్షి, హైదరాబాద్: మండు వేసవి కాకున్నా.. మహా నగరంలో 4–5 రోజులుగా ఎండ దంచుతోంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుత సమయంలో సాధారణంగా ఉండే చల్లటి వాతావరణానికి భిన్నంగా పగటి పూట పొడి వాతావరణం నెలకొంది. ఈ తాత్కాలిక మార్పులను రుతుపవన విరామంగా విశ్లేíÙస్తున్నారు. 2015 జూలైలో ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడి, సుదీర్ఘ వాతావరణ విరామం ఏర్పడింది. నాడు జూలైలో నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4–5 డిగ్రీలు పెరిగి, 35.5–36 డిగ్రీల మధ్య నమోదై రికార్డు సృష్టించాయి.
జూలైలో హైదరాబాద్ సగటు గరిష్ట ఉష్ణోగ్రత 30–31 డిగ్రీల మధ్య ఉండాలి. కానీ, ఇప్పుడు 34 డిగ్రీలు దాటుతోంది. రాత్రిళ్లు సైతం కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగి 25 డిగ్రీల కంటే ఎక్కువ నమోదవుతోంది. ప్రస్తుత సీజన్‌లో తీవ్రమైన ఎండ కంటే నిరంతరాయంగా ఆకాశంలో మేఘాలు లేకపోవడమే ఈ మార్పునకు ప్రధాన కారణం. బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేని ప్రతిసారీ జూలైలో ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం సహజమని నిపుణులు చెబుతున్నారు. మరో 3–4 రోజులు నగరంలో ఇదే పరిస్థితి ఉంటుందని, నైరుతి రుతుపవనాలు పుంజుకుని, ఈ నెల మూడో వారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
కూలర్లు, ఏసీలు మళ్లీ వినియోగంలోకి
రాత్రిపూట ఉక్కపోతతో గ్రేటర్ జిల్లాల వాసులు ఉక్కిరిబిక్కిరికి లోనవుతున్నారు. తొలకరి వర్షాలతో స్విచ్ ఆఫ్ అయిన కూలర్లు, ఏసీలు మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయి. దీంతో విద్యుత్ డిమాండ్ మళ్లీ గరిష్ట స్థాయికి చేరుతోంది. అర్థరాత్రి ఒక్కసారిగా డిమాండ్‌తో ఫీడర్లు ఒత్తిడికి గురై తరచూ ట్రిప్పవుతున్నాయి. కరెంట్ లేక అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్‌లు నిలిచిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 1912 కాల్ సెంటర్, ఎక్స్, ఫేస్‌బుక్, వాట్సాప్ చాట్‌బోట్, సెంట్రల్ బ్రేక్‌డౌన్ బృందాల నంబర్లకు ఫోన్ చేసినా ఫలితం ఉండటం లేదు.


