ముదస్సిర్‌ అరెస్ట్‌.. గతంలో మహారాష్ట్ర సీఎం బంధువుకే ‘స్పాట్‌’ | Hyderabad Jubilee Hills Police Operation Accused Mudassir Arrested | Sakshi
Sakshi News home page

ముదస్సిర్‌ అరెస్ట్‌.. గతంలో మహారాష్ట్ర సీఎం బంధువుకే ‘స్పాట్‌’

Jun 26 2026 11:21 AM | Updated on Jun 26 2026 11:21 AM

Hyderabad Jubilee Hills Police Operation Accused Mudassir Arrested

గణపతిరావు షిండేను కిడ్నాప్‌ చేసిన గ్యాంగ్‌

కీలకపాత్ర పోషించిన నగర వాసి

అనుచరుడితో సహా పట్టుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు

నిందితులను చూపిస్తున్న డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్రకు ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాష్ట్రంలోని అఖడా బాలాపూర్‌ పోలీస్టేషన్‌ పరిధి నుంచి ఆయన సమీప బంధువు గణపతిరావు షిండేను అపహరించిన గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరించిన హైదరాబాదీ ముదస్సిర్‌ సహా అతడి అనుచరుడు అమీర్‌ ఖాన్‌ను మరో కేసులో జూబ్లీహిల్స్‌ జోన్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు నాటు తుపాకులు, ఏడు తూటాలు స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ గురువారం వెల్లడించారు.

చదువు కోసం వెళ్లి నేరాల బాట.. 
పాతబస్తీకి చెందిన ముదస్సిర్‌ హుస్సేన్‌ అలియాస్‌ షా బాబా 2022లో ఓ కోర్సు చేయడం కోసం ముంబై వెళ్లాడు. అక్కడే  తన స్నేహితుడైన షోయబ్‌ ద్వారా నాందేడ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ సూరజ్‌ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. అతడి ముఠాతో కలిసి ముదస్సిర్‌ 2024లో కర్ణాటకలో ఓ దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించాడు.

రూ.కోటి కోసం కిడ్నాప్‌.. 
వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు అయిన గణపతిరావు షిండేకు.. సూరజ్‌ సింగ్‌కు మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉండేవి. ఈ నేపథ్యంలో సూరజ్‌కు గణపతిరావు రూ.కోటి బాకీ పడ్డాడు. ఆ మొత్తం ఇవ్వడానికి అతడు అంగీకరించినప్పటికీ సూరజ్‌ మరో ఎనిమిది మందితో కలిసి 2024లో కిడ్నాప్‌ చేసి రూ.4 కోట్లు డిమాండ్‌ చేశాడు. నాటి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే జోక్యంతో రెండు రోజుల్లోనే గణపతిరావును పోలీసులు రెస్క్యూ చేసి ముఠాను అరెస్టు చేశారు.

ఈ గ్యాంగ్‌లో ముదస్సిర్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ కేసులో అఖాడా బాలాపూర్‌ పోలీసులు ముదస్సిర్‌ సహా అందరినీ అరెస్టు చేసి పర్భని జైల్లో ఉంచారు. అనంతరం ఎనిమిది నెలలకు బెయిల్‌పై వచి్చన ముదస్సిర్‌  తన స్నేహితుడైన నాందేడ్‌ వాసి అమీర్‌ ఖాన్‌తో కలిసి దోపిడీలు చేయాలని స్కెచ్‌ వేశాడు. దీనికోసం రెండు నాటు తుపాకులు, ఏడు తూటాలు కొన్నాడు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన తహ, జుబేర్, అమీర్‌లతో ముఠా కట్టిన అమీర్‌ ఖాన్‌ వాహనాలను చోరీలు చేయించి విక్రయించాడు.

తీగలాగితే కదిలిన డొంక.. 
ఈ కేసులో జూబ్లీహిల్స్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.యదేందర్‌కు వాహన చోరీలు చేస్తున్న గ్యాంగ్‌పై సమాచారం అందింది. దీంతో ఎస్సై మహ్మద్‌ జాహెద్‌ సహా తన టీమ్‌తో వలపన్నిన ఆయన ఇటీవల తహ, జుబేర్, అమీర్‌లను పట్టుకుని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులను మొయినాబాద్‌ పోలీసులకు అప్పగించి విచారణ చేయగా.. ముదస్సిర్‌ కూడా కీలకమని తేలింది. దీంతో  నిఘా ఉంచిన పోలీసులకు బుధవారం రాత్రి మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ హోటల్‌ వద్ద ముదస్సిర్, అమీర్‌ ఖాన్‌ చిక్కారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement