breaking news
Mudassir
-
తాకట్టు పెడతాడు.. తస్కరిస్తాడు!
హైదరాబాద్: బంగారం, వస్తువులు, వాహనాలను తస్కరించి తాకట్టు పెట్టిన ఉదంతాలు తరచు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. చాలా మంది చోరుల నైజమే ఇది. అయితే జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత వారం పట్టుకున్న ముదస్సిర్ హుస్సేన్ వ్యవహారం దీనికి భిన్నం. అతను కార్లను తాకట్టు పెట్టిన తర్వాత తస్కరిస్తుంటాడు. ఆ నిందితుడిని వివిధ కోణాల్లో విచారించిన అధికారులు ఈ విషయం గుర్తించారు. మరోపక్క ఇతడికి బాస్‌గా వ్యవహరించిన నాందేడ్ గ్యాంగ్‌స్టర్ సూరజ్ సింగ్‌కు ఖలిస్థాన్ ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్లు బయటపడింది. దీంతో ముదస్సీర్ వ్యవహారాన్ని నగర పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.కార్ల విక్రయంతోనే మొదలైన కథ...పాతబస్తీలోని ఖిల్వత్ ప్రాంతానికి చెందిన ముదస్సిర్ హుస్సేన్ అలియాస్ షా బాబా 2022లో ముంబై వెళ్లాడు. ఆ తరువాత స్నేహితుడి ద్వారా ముంబైలో కార్లు ఖరీదు చేసి నగరంలో విక్రయించడం ప్రారంభించాడు. తొలిసారిగా అక్కడ ఓ కారును రూ.1.35 లక్షలకు ఖరీదు చేసి నగరానికి తరలించి రూ.1.75 లక్షలకు అమ్మాడు. ఇలా మొదలైన వ్యాపారాన్ని 2024 వరకు చేశాడు. ఈ సందర్భంలో ఇతడి స్నేహితుడైన షోయబ్ ద్వారా నాందేడ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ సూరజ్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. పేకాటకు బానిసగా మారిపోయిన ముదస్సిర్ మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ఆడటం మొదలెట్టాడు.ఇక్కడి నుంచి అద్దెకు తీసుకెళ్లి... ఈ పేకాట శిబిరాలకు వెళ్లడానికి ముదస్సిర్ నగరం నుంచే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అద్దెకు తీసుకునే వాడు. ఎల్లో రిజిస్ట్రేషన్ ప్లేట్ కాకుండా వైట్ ప్లేట్‌తో ఉన్న వాటినే తీసుకునే వాడు. దారిలో ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారులు తనిఖీ చేస్తే అది తన స్నేహితుడిదని చెప్పేవాడు. మహారాష్ట్రకు చేరడానికి ముందే ఆ వాహనానికి ఓ మారు తాళం తయారు చేయించి దగ్గర పెట్టుకునే వాడు. పేకాటలో డబ్బు వస్తే అంతా సజావుగానే ఉండేది. డబ్బు కోల్పోతే మాత్రం ఆ కారు తనదే అంటూ పేకాట శిబిరం నిర్వాహకుల వద్ద తాకట్టు పెట్టేవాడు. అలా వచ్చిన డబ్బుతో మళ్లీ పేకాట ఆడి.. అదును చూసుకుని తన వద్ద ఉన్న మారు తాళంతో ఆ వాహనాన్ని తస్కరించుకు వచ్చేవాడు.ఖలిస్థాన్ లింకులపై ఆరా... గ్యాంగ్‌స్టర్ సూరజ్ సింగ్‌తో పాటు అతడి సోదరుడు ఆకాష్ సింగ్‌కు ఖలిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. సూరజ్ ముఠాతో ముదస్సిర్ 2024లో తొలినేరం చేశాడు. కర్ణాటకలోని బసవకళ్యాణ ప్రాంతంలో తన బంధువు నుంచి రావాల్సిన డబ్బు వసూలు కోసం దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన తర్వాతే సూరజ్ ఆదేశాల మేరకు మహారాష్ట్రలో గణపతిరావు షిండే కిడ్నాప్‌కు పాల్పడ్డాడు. సూరజ్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన ముదస్సిర్‌కు కూడా ఖలిస్థాన్ లింకులు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన సందేహాలు నివృతి చేసుకోవడానికి వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. ముదస్సిర్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇతడికి తుపాకులు విక్రయించిన వ్యక్తుల వివరాలు ఆరా తీయనున్నారు. -
ముదస్సిర్ అరెస్ట్.. గతంలో మహారాష్ట్ర సీఎం బంధువుకే ‘స్పాట్’
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రకు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాష్ట్రంలోని అఖడా బాలాపూర్ పోలీస్టేషన్ పరిధి నుంచి ఆయన సమీప బంధువు గణపతిరావు షిండేను అపహరించిన గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరించిన హైదరాబాదీ ముదస్సిర్ సహా అతడి అనుచరుడు అమీర్ ఖాన్‌ను మరో కేసులో జూబ్లీహిల్స్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు నాటు తుపాకులు, ఏడు తూటాలు స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ గురువారం వెల్లడించారు.చదువు కోసం వెళ్లి నేరాల బాట.. పాతబస్తీకి చెందిన ముదస్సిర్ హుస్సేన్ అలియాస్ షా బాబా 2022లో ఓ కోర్సు చేయడం కోసం ముంబై వెళ్లాడు. అక్కడే తన స్నేహితుడైన షోయబ్ ద్వారా నాందేడ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ సూరజ్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. అతడి ముఠాతో కలిసి ముదస్సిర్ 2024లో కర్ణాటకలో ఓ దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించాడు.రూ.కోటి కోసం కిడ్నాప్.. వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు అయిన గణపతిరావు షిండేకు.. సూరజ్ సింగ్‌కు మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉండేవి. ఈ నేపథ్యంలో సూరజ్‌కు గణపతిరావు రూ.కోటి బాకీ పడ్డాడు. ఆ మొత్తం ఇవ్వడానికి అతడు అంగీకరించినప్పటికీ సూరజ్ మరో ఎనిమిది మందితో కలిసి 2024లో కిడ్నాప్ చేసి రూ.4 కోట్లు డిమాండ్ చేశాడు. నాటి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే జోక్యంతో రెండు రోజుల్లోనే గణపతిరావును పోలీసులు రెస్క్యూ చేసి ముఠాను అరెస్టు చేశారు.ఈ గ్యాంగ్‌లో ముదస్సిర్ కీలక పాత్ర పోషించాడు. ఈ కేసులో అఖాడా బాలాపూర్ పోలీసులు ముదస్సిర్ సహా అందరినీ అరెస్టు చేసి పర్భని జైల్లో ఉంచారు. అనంతరం ఎనిమిది నెలలకు బెయిల్‌పై వచి్చన ముదస్సిర్ తన స్నేహితుడైన నాందేడ్ వాసి అమీర్ ఖాన్‌తో కలిసి దోపిడీలు చేయాలని స్కెచ్ వేశాడు. దీనికోసం రెండు నాటు తుపాకులు, ఏడు తూటాలు కొన్నాడు. ఈ క్రమంలోనే నగరానికి చెందిన తహ, జుబేర్, అమీర్‌లతో ముఠా కట్టిన అమీర్ ఖాన్ వాహనాలను చోరీలు చేయించి విక్రయించాడు.తీగలాగితే కదిలిన డొంక.. ఈ కేసులో జూబ్లీహిల్స్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్.యదేందర్కు వాహన చోరీలు చేస్తున్న గ్యాంగ్‌పై సమాచారం అందింది. దీంతో ఎస్సై మహ్మద్ జాహెద్ సహా తన టీమ్‌తో వలపన్నిన ఆయన ఇటీవల తహ, జుబేర్, అమీర్లను పట్టుకుని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులను మొయినాబాద్ పోలీసులకు అప్పగించి విచారణ చేయగా.. ముదస్సిర్ కూడా కీలకమని తేలింది. దీంతో నిఘా ఉంచిన పోలీసులకు బుధవారం రాత్రి మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ హోటల్ వద్ద ముదస్సిర్, అమీర్ ఖాన్ చిక్కారు. -
వికెట్లతో రాణించిన అనంత స్పిన్నర్
కర్నూలుపై ఇన్నింగ్స్ 365 పరుగులతో అనంత ఘన విజయం ముదస్సిర్ మాయాజాలం అనంతపురం సప్తగిరి సర్కిల్: ముదుస్సిర్ బంతితో మాయాజాలం చేశాడు. తన స్పిన్‌తో కర్నూలును బోల్తా కొట్టించాడు. 6 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కడపలో జరుగుతున్న అండర్–19 అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం 12–2 తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కర్నూలు జట్టు...అనంత బౌలర్లు ముదస్సిర్, సాంబశివల ధాటికి 73 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. దీంతో అనంతపురం జట్టు ఇన్నింగ్స్ 354 పరుగులతో రెండో విజయాన్ని నమోదు చేసింది. చివరి రోజు అనంత బౌలర్లు ముదస్సిర్ 11.3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 6 వికెట్లు సాధించాడు. సాంబశివ 14 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లను సాధించాడు. దీంతో అనంత జట్టుకు 7 పాయింట్లు లభించాయి. అనంత జట్టు ప్రదర్శనపై జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, కేఎస్ షాహబుద్దీన్లు హర్షం వ్యక్తం చేశారు.


