పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తాం
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న హాస్టళ్లు, గురుకుల విద్యాసంస్థల్లో చేపడుతున్న మరమ్మతులను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. 2023 నుంచి పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.7.5 కోట్ల మరమ్మతు బిల్లులను తక్షణమే క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాలు, హాస్టళ్ల అద్దెలు, డైట్, కాస్మొటిక్ చార్జీలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆర్థిక శాఖకు పంపాలన్నారు. విద్యార్థులకు సంబంధించిన బిల్లుల విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదన్నారు. సంక్షేమ శాఖలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే సమర్పిస్తే ప్రభుత్వం వాటి చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేసి యూపీఎస్సీ, గ్రూప్–1, గ్రూప్–2 తదితర పోటీ పరీక్షల్లో విజయశాతాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అంబేడ్కర్ టవర్, బాబూ జగ్జీవన్ రామ్ విద్యార్థి వసతి భవనాల నిర్మాణానికి నెలవారీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, బహుళ అంతస్తుల అంబేడ్కర్ భవనాన్ని 2027 ఏప్రిల్ 14న ప్రారంభించే లక్ష్యంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రతిపాదిత ఈవీ ద్విచక్ర వాహనాల (స్కూటర్) పథకంపై సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. ప్రతి జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ల స్థాపనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డైట్ చార్జీలను 40 శాతం, కాస్మొటిక్ చార్జీలను 200 శాతం పెంచిందన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణకు నెలకు రూ.29 కోట్ల నిధులు అవసరమని, పెండింగ్ అద్దె బకాయిల విడుదలకు సంబంధించి రూ.27 కోట్ల అవసరమని అధికారులు తెలపగా.. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని భట్టి సూచించారు.


