కీచక ఎస్ఐ: భర్తతో విడాకులు ఇప్పించి నాలుగేళ్లుగా..! | Hanamkonda SI Godari Rajkumar Thretened Woman | Sakshi
Sakshi News home page

కీచక ఎస్ఐ: భర్తతో విడాకులు ఇప్పించి నాలుగేళ్లుగా..!

Jun 15 2026 11:55 AM | Updated on Jun 15 2026 12:30 PM

 Hanamkonda SI Godari Rajkumar Thretened Woman

వరంగల్‌ క్రైం: ఓ వివాహితకు న్యాయం చేస్తానని నమ్మించి, పెళ్లి పేరుతో మోసం చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన సీసీఎస్‌ విభాగ ఎస్సై రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని హనుమకొండ ఇన్‌స్పెక్టర్‌ మచ్చ శివకుమార్‌ ఆదివారం వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన ఓ యువతి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అనంతరం వారికి ఓ కుమార్తె జన్మించింది. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో 2022 మార్చిలో బాధితురాలు తన భర్తపై హనుమకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై రాజ్‌కుమార్‌ బాధితురాలికి న్యాయం చేస్తానని నమ్మించాడు. తనకు పరిచయం ఉన్న న్యాయవాది ద్వారా ఆమెకు భర్త నుంచి విడాకులు ఇప్పించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి నమ్మకం సంపాదించుకున్నాడు.

ఈ క్రమంలో బాధితురాలితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంబంధం కారణంగా ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా, అబార్షన్‌ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా రాజ్‌కుమార్‌ నిరాకరించినట్లు బాధితురాలు ఆరోపించింది.

తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు హనుమకొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ప్రాథమిక ఆధారాలు లభించడంతో నిందితుడు రాజ్‌కుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement