తెలంగాణ: రేషన్‌కార్డులిస్తూనే ఉంటాం 

CM Revanth Reddy On New Ration cards - Sakshi

ప్రజాపాలన దరఖాస్తు ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం 

తెల్ల రేషన్‌కార్డు లేకుంటే పథకాలు కష్టం 

పథకాలు కావాల్సిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి  

ప్రజాపాలన దరఖాస్తులు రేషన్‌కార్డులు లేనివారు ఇచ్చినా తీసుకుంటాం 

వాటితో పాటు ప్రత్యేక కౌంటర్‌లో ఇతర విజ్ఞాపనలూ ఇవ్వొచ్చు 

విద్యా భరోసా కార్డుల జారీకి వచ్చే విద్యా సంవత్సరం నుంచి దరఖాస్తులు 

ప్రజాపాలన దరఖాస్తు ఫారం, లోగో, పోస్టర్‌ ఆవిష్కరించిన రేవంత్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: ‘తెల్ల రేషన్‌కార్డు లేకుంటే ప్రజాపాలన కింద పథకం రావడం కష్టం. అందువల్ల కొత్త రేషన్‌కార్డులు కూడా ఇస్తాం. రేషన్‌కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం నిరంతర ప్రక్రియగా ముందుకు వెళుతుంది. అలాగే ప్రజాపాలన దరఖాస్తులు రేషన్‌కార్డులు లేనివారు ఇచ్చినా తీసుకుంటాం. ప్రజాపాలనలో సంబంధిత దరఖాస్తుతో పాటు ఇతర విజ్ఞాపనలను కూడా స్వీకరిస్తాం. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం.

రేషన్‌కార్డు, భూముల వారసత్వ బదిలీ, ఇతర ఏం సమస్యలున్నా దరఖాస్తు తీసుకుంటాం..’ అని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల డేటా ఇప్పటికే తమ వద్ద ఉందని చె ప్పారు. పథకాలు కావాల్సిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు.

యువ వికాసం కింద విద్యా భరోసా కార్డుల జారీ కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లోనే కౌంటర్లు పెట్టి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించా రు. ఎన్నికల హామీని నిలబెట్టుకునే క్రమంలో ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 8 పనిదినాల్లో గ్రామాలు, మున్సిపల్‌ వార్డులు, పట్టణాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.

తండాలు, గూడేలు,  మారుమూల పల్లెల్లోని అత్యంత నిరుపేదలు, నిస్సహాయులకు సహాయం అందించడానికే గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజాపాలన కార్యక్రమం లోగో, పోస్టర్, దరఖాస్తు ఫారాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

ప్రజల చెంతకు పాలన 
‘సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి సచివాలయం లేదా ప్రజాభవన్‌లో జరిపే ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేయడం పేదలకు అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఒకరోజు ముందే వచ్చి రాత్రబస ఇక్కడే చేస్తున్నారు. గత ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం, పరిపాలన ప్రజల వద్దకు చేరకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు పేరుకుపోయి ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారాయి.

ఈ నేపథ్యంలో ప్రజలను ప్రజావాణి కోసం ప్రజాభవన్‌కు రప్పించుకోవడం కాకుండా, గతంలో గడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెట్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను ఏ ప్రజలైతే ఎన్నుకున్నారో వారి గ్రామాలకే పంపించడం ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లిన భావన కలుగుతుంది. ఇది ప్రజల ప్రభుత్వం అని, సమస్యలు పరిష్కరిస్తుందనే విశ్వాసం ఏర్పడుతుంది. వారంలో రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తేనే దాదాపుగా 24 వేల పైచిలుకు దరఖాస్తులొచ్చాయి. భూసమస్యలు, ఇళ్లు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ లాంటి సమస్యలే అధికం.  

వీలున్న విజ్ఞాపనలన్నింటినీ పరిష్కరిస్తాం 
ఈ ప్రజావాణి దరఖాస్తులన్నిటికీ ఒక నంబర్‌ ఇచ్చి డిజిటలైజ్‌ చేస్తున్నాం. వాటిని సంబంధిత శాఖలకు, అధికారులకు పంపిస్తున్నాం. ఒక ఐఏఎస్‌ అధికారి, సిబ్బందితో ఇందుకు వ్యవస్థను ఏర్పాటు చేశాం. విజ్ఞాపన పత్రం పురోగతిని, అది ఎక్కడో ఉందో తెలుసుకోవడానికి ట్రాకింగ్‌ సిస్టం పెట్టాం. పరిష్కారానికి వీలు ఉన్నవన్నీ పరిష్కరిస్తాం. వీలు లేనప్పుడు దరఖాస్తుదారులకు కారణాలు తెలియజేస్తాం..’ అని సీఎం చెప్పారు. 

అర్హులెవరో తెలుసుకోవడానికే దరఖాస్తులు 
‘మహాలక్ష్మీ, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు లాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే నిజమైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలి. అప్పుడు లక్ష్యం పెట్టుకుని, దానిని చేరడానికి అహరి్నశలు కృషి చేయగలం. ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకుంటే ఎన్ని పరిష్కరించాం, ఇంకా ఎన్ని పరిష్కరించాల్సి ఉందనేది తెలుస్తుంది. జనాభా అధికంగా ఉండే గ్రామాల్లో ఎక్కువ కౌంటర్లు, మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.  

రైతుబందు సీలింగ్‌పై అసెంబ్లీ చర్చ 
రైతుబంధుపై సీలింగ్‌ విధించే అంశంపై అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చర్చించి అందరి సమ్మతితో నిర్ణయం తీసుకుంటాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుందని ముందే ఊహించి వారికి ఆర్థిక సహాయం అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాం. వారి వివరాలూ సేకరిస్తాం. తబ్లిగీ జమాత్‌ సమావేశాలకు 2006 నుంచి ప్రభుత్వం సాయం చేస్తోంది. ఆ సమావేశాలను ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది..’ అని రేవంత్‌ తెలిపారు. 

తర్వాత కూడా దరఖాస్తులు ఇవ్వొచ్చు 
‘గ్రామసభల్లో దరఖాస్తు ఇవ్వలేకపోయిన వారు తమకు పథకాలు వర్తించవని ఆందోళనపడాల్సిన అవసరం లేదు. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామ పంచాయతీల్లో గ్రామ కార్యదర్శి, అంగన్‌వాడీ టీచర్లకు దరఖాస్తు సమర్పించవచ్చు. ఆ తర్వాత కూడా నిజమైన లబ్ధిదారులు ఎంపీడీఓ, తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఇవ్వవచ్చు. హైదరాబాద్‌లో దరఖాస్తును ఉర్దూలో కూడా ఇస్తాం. గ్రామాల్లో ఉదయం 8–12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2–6 వరకు దరఖాస్తులు ఇవ్వొచ్చు. పట్టణాల్లో ఉదయం 10–5 గంటల వరకు అందజేయవచ్చు. డిసెంబర్‌ 7న బాధ్యతలు చేపట్టిన మా ప్రభుత్వం జనవరి 7లోపే లబ్ధిదారుల సమారాన్ని సేకరిస్తుంది..’ అని చెప్పారు. 

గవర్నర్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తాం 
‘సచివాలయంలో లోపల పత్రికా సమావేశం పెట్టుకోగలమని, ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి కూర్చోగలుగుతామని జర్నలిస్టులు భావించి ఉండకపోవచ్చు. అప్పట్లో పోలీసులు అడ్డుకుంటే ప్రజాప్రతినిధులమైనా రాలేక మేం అటు నుంచి అటే వెళ్లిపోయాం. ఇకపై సీఎం, మంత్రులు ఇదే హాల్‌లో మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. మేము స్వేచ్ఛనిస్తాం, మీరు (జర్నలిస్టులు) దురి్వనియోగం చేయకుండా సహకరించాలి. జర్నలిస్టుల సమస్యలూ చాలా కాలంగా పేరుకుపోయాయి. త్వరలో దృష్టి పెడ్తాం. ఆందోళన వద్దు. మాకు హిడెన్‌ ఎజెండా లేదు. మాపై కేసులు లేవు. లూట్‌మార్‌ చేసిన వారిలాగా మాఫీల కోసం వంగాల్సిన అవసరం లేదు. ప్రధానికి దరఖాస్తు ఇచ్చాం. రాష్ట్రానికి సహకరిస్తామని ప్రధాని కూడా హామీ ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్‌తో సత్సంబంధాలు ఇలాగే కొనసాగిస్తాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top