సాక్షి, మెదక్: బస్సులో సీటు విషయంలో చోటుచేసుకున్న చిన్న వివాదం కాస్తా పెద్ద రచ్చగా మారింది. మెదక్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నర్సాపూర్ వద్ద బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో ప్రయాణం మధ్యలోనే ఉద్రిక్తత నెలకొంది.
నర్సాపూర్ వద్ద ఒక మహిళతో కలిసి బస్సులో ఎక్కిన ఓ దివ్యాంగుడు సీటు కోసం ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దివ్యాంగుడికి సీటు ఇవ్వాలని అదే బస్సులో ఉన్న మరో మహిళ కోరగా, అందుకు ఆమె నిరాకరించింది. “సీటు ఇవ్వడం సాధ్యం కాదు” అన్న మాటతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
చిన్నగా ప్రారంభమైన మాటల తూటాలు క్షణాల్లోనే గొడవగా మారి తోపులాట వరకు వెళ్లినట్లు ప్రయాణికులు తెలిపారు. పరిస్థితి అదుపు తప్పేలా మారడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును నేరుగా నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
పోలీసులు బస్సులోని ప్రయాణికులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివాదంలో ఉన్న మహిళా ప్రయాణికులకు పోలీసులు నచ్చజెప్పి, ఎలాంటి పెద్ద సమస్య లేకుండా అక్కడి నుంచే పంపించారు. అనంతరం బస్సు తిరిగి తన గమ్యస్థానానికి బయలుదేరినట్లు సమాచారం. చిన్న సీటు వివాదం కారణంగా బస్సు కొద్దిసేపు ఆగిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


