
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: కేటీఆర్
వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరిన వారిని ఓడించాలి
గద్వాల ఉప ఎన్నికలో సామాన్యుడికి టికెట్ ఇస్తాం
జూన్ చివరి వారంలో బీఆర్‌ఎస్ సభ్యత్వం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్‌ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి. ఇది ఆవేశంతో చెప్పడం లేదు బాధతో చెప్తున్నా. మనతోనే ఉండి మనకు వెన్నుపోటు పొడిచి పార్టీని విడిచి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలకు కర్రు కాల్చి వాత పెట్టాలి. ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. కాంగ్రెస్ దరిద్రాన్ని ఇంకా ఎన్ని రోజులు చూడాలని ప్రజలు బాధ పడుతూ వారిని గద్దె దించేందుకు ఏదైనా మార్గం చూపమని అడుగుతున్నారన్నారు.
గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జూన్ నెలాఖరులో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తామని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గద్వాల నియోజకవర్గంలో సామాన్యుడికి టికెట్ ఇస్తామని, జెట్ స్పీడ్‌తో పార్టీ గెలుపు ఖాయమన్నారు.
అపరిచితుడిలా సీఎం వైఖరి
కాంగ్రెస్ ఇచి్చన అభయహస్తం శతాబ్దపు అతి పెద్ద మోసమని, ఆ పారీ్టకి 55 ఏళ్లు అధికారం ఇచ్చినా ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటల మనిషి కాదని, మూటల మనిషి అని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై అనేకమార్లు మాట మార్చాడన్నారు. సీఎం మానసిక పరిస్థితిపై తనకు అనుమానాలు ఉన్నాయని, ఆయన వైఖరి అపరిచితుడిలా ఉందని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినా ఆ పార్టీ అగ్రనేతలు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం భట్టికి 20 నుంచి 30 శాతం కమిషన్లు నడుస్తున్నాయని, భట్టికి మినహా రాష్ట్రంలో అందరికీ అప్పులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లలో తాము బలమైన పునాదులు వేస్తే కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు బొక్కబోర్లా పడ్డారన్నారు.
టీజేఎఫ్ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ సంబురాల పోస్టర్‌ను ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి కేటీఆర్ విడుదల చేశారు. తెలంగాణ విముక్తి కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో సాగిన ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు.