ఇష్టమెచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.. బండి సంజయ్‌ | Bandi Sanjay responds to Kaushik Reddy attack | Sakshi
Sakshi News home page

ఇష్టమెచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం.. బండి సంజయ్‌

May 7 2026 8:10 PM | Updated on May 7 2026 8:20 PM

Bandi Sanjay responds to Kaushik Reddy attack

సాక్షి, కరీంనగర్: బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి కార్యాలయంపై బీజేపీ నేతల దాడి నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎ‍మ్మెల్యేల కార్యాలయంపై దాడి చేయడాన్ని సమర్థించడం లేదని అయితే దాడుల కల్చర్‌ మాత్రం బీఆర్‌ఎస్‌ పార్టీదేనన్నారు. మితీమిరిన అహంకారంతో వ్యవహరించొద్దనే ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

అయితే కౌశిక్‌ రెడ్డిపై దాడికి నిరసనగా ఎల్లుండి కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ బంద్‌ నిర్వహించనుంది. దీనికి బీఆర్ఎస్‌ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హాజరుకానున్నట్లు తెలిపారు. కాగా అంతకు ముందు హుజురాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి క్యాంపు ఆఫీసుపై దాడికి బీజేపీ శ్రేణులు యత్నించాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. 

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. దానితో పాటు హైదరాబాద్‌లోని కౌశిక్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన సురక్షితంగా బయటపడగా వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. మరోవైపు.. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ క్యాంప్‌ ఆఫీస్‌పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్‌రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు.

దాడి ఎందుకు జరిగింది?

కరీంనగర్‌లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్‌ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement