నేడు అంత్యక్రియలు
సాక్షి, యాదాద్రి : నమ్మిన సిద్ధాంతాన్ని జీవితాంతం ఆచరించారు.. తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగినా సాధారణ జీవితమే గడిపారు. పదవులు లేకున్నా ప్రజల పక్షాన పనిచేసిన భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి (82) అనా రోగ్యంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2గంటలకు మరణించారు. ఆయన 1962– 1970 వరకు తొలుత స్వగ్రామం బీబీనగర్ మండలం బ్రా హ్మ ణపల్లికి సర్పంచ్‌గా, రెండుసార్లు భువనగిరి తాలుకా సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
రెండు పర్యాయాలు విజయం
1978లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మాజీ మంత్రి కొండాలక్ష్మణ్ బాపూజీపై గెలిచారు. 1983 ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఎన్టీ రామారావు ప్రభంజనం కనిపించినా, భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండవ సారి కొమ్మిడి గెలుపొందారు. 1985లో అసెంబ్లీకి వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అప్పట్లో ఎన్టీ రామారావు స్వయంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినా కూడా నర్సింహారెడ్డి వెళ్లలేదు.
స్కూటర్‌పై అసెంబ్లీకి..
రెండు సార్లు ఎమ్మెల్యే, సర్పంచ్‌గా పనిచేసిన నర్సింహరెడ్డికి సొంత ఇల్లులేదు. భూస్వామ్య కు టుంబంలో జన్మించిన ఆయన నిస్వార్థ ప్రజా సేవ చేశారు. స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో తండ్రి నిర్మించిన ఇంట్లో ఉంటూనే ఆయన ప్రజలకు సేవలందించారు. ఆయన ఆర్టీసీ బస్సులలోనే తిరిగేవా రు. స్కూటర్ పైనే అసెంబ్లీకి వెళ్లేవారు. కొద్ది రో జులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ఆయన.. ఆ తర్వాత ఘట్‌కేసర్ సమీపంలోని సంస్కృతి టౌన్‌షిప్ (సింగపూర్ సిటీ)లో చాలారోజులు అద్దెకున్నారు. రామంతాపూర్‌లో నివాసముంటున్న పెద్ద కూతురు రజినిరెడ్డి ఇంట్లోనే చివరి రోజులు గడిపారు.
గోదావరి – మూసీ అనుసంధానం కోసం...
● భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, చౌటుప్పల్ ప్రాంతాలకు గోదావరి జలాలు రప్పించాలని, గోదావరి–మూసీనదుల అనుసంధానం కోసం కొమ్మిడి సుదీర్ఘ పోరాటం చేశారు. గోదావరి జలా లను మూసీ నదిలోకి మళ్లించడం ద్వారా లక్ష ఎకరాలను ఏ విధంగా సశ్యశ్యామలం చేయవచ్చో ఒక బ్లూప్రింట్ తయారు చేశారు. ఆ బ్లూప్రింటును ఒక పెద్ద ఫ్లెక్సీపై ప్రింట్ చేయించి, ఆయన వద్దకు ఎవరు వెళ్లినా ఒక ఇంజనీర్‌లా వివరించేవారు. మూసీ జల కాలుష్యం నివారణకు, మానవ వ్యర్థాలతో పాటు రసాయన వ్యర్థాలను మూసీ నదిలో కలుపొద్దని అనేక పోరాటాలు చేశారు.
● ప్రాణహిత – చేవేళ్ల కోసం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట చెరువును రిజర్వాయర్ చేయాలని పోరాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఆమోద యోగ్యం కాదని నిక్కచ్చిగా స్పష్టం చేశారు.
● 2013 మర్చి నెలలో బీబీనగర్‌లో నిమ్స్ (ప్రస్తుతం ఎయిమ్స్) ఏర్పాటు కోసం కోసం ఆమరణ దీక్ష చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచన మేరకు సీనియర్ నేత జానారెడ్డి బీబీనగర్‌కు వచ్చి నర్సింహారెడ్డి చేత దీక్ష విరమింపజేశారు.
కొమ్మిడి నర్సింహారెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి బుధవారం ఉదయం స్వగ్రామం బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి తీసుకువస్తారు. ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. అందుకు గ్రామంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫ భువనగిరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం
ఫ అద్దె ఇంట్లోనే నివసించిన ఆదర్శ నేత
ఫ మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి అనారోగ్యంతో కన్నుమూత


