సాండ్‌ ట్యాక్సీకి మళ్లీ అంతరాయం | - | Sakshi
Sakshi News home page

సాండ్‌ ట్యాక్సీకి మళ్లీ అంతరాయం

Jul 8 2026 2:02 AM | Updated on Jul 8 2026 2:02 AM

జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లా

అర్వపల్లి : గృహ నిర్మాణదారులకు తక్కువ ధరకే ఇళ్ల వద్దకు ఇసుక సరఫరా చేసేందుకు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ చొరవతో రెండేళ్ల నుంచి అమలు చేస్తున్న ‘మన ఇసుక–మన వాహనం’ సాండ్‌ ట్యాక్సీ విధానానికి మళ్లీ అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మూసీనదిలో జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం, నాగారం మండలం పేరబోయినగూడెం గ్రామాలకు చెందిన రెండు ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. అయితే రోడ్లు, ఇసుక లోడింగ్‌ వద్ద సమస్యలు ఏర్పడి మళ్లీ క్వారీలు బందయ్యాయి. రెండు రోజుల నుంచి ఇసుక సరఫరా నిలిచిపోయింది. పేరబోయినగూడెంలోని వాగులో ఇసుక నిల్వ లేక అక్కడి ట్రాక్టర్లు మండల హద్దుదాటి జాజిరెడ్డిగూడెం శివారులోని తుంగగూడెం రీచ్‌కు వచ్చి ఇసుకను లోడ్‌ చేసుకుంటున్నాయని ఇరు గ్రామాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో రెండు మండలాల తహసీల్దార్లు, ఎస్‌ఐలు, సీఐ, మైనింగ్‌ అధికారులు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో క్వారీలు బందై ఇసుక రవాణా నిలిచిపోయింది.

ఇక్కడి నుంచే రెండు నియోజకవర్గాలకు..

నాగారం మండలం పేరబోయినగూడెం క్వారీ నుంచి 225, తుంగగూడెం క్వారీ నుంచి 420 చొప్పున ట్రాక్టర్లలో రోజూ సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు ఇసుక సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు క్వారీల పరిధిలో సుమారు 1,800 ట్రాక్టర్లకుపైగానే ఇసుక కావాల్సిన వారు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్నారు. అయితే పేరబోయినగూడెం క్వారీలో ఇసుక లేకపోవడంతో అక్కడి ట్రాక్టర్లు తుంగగూడెంలోని తమ క్వారీకి వస్తుండడంతో గొడవలు జరుగుతున్నాయని జాజిరెడ్డిగూడెం మండల ట్రాక్టర్‌ యజమానులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందదించి క్వారీల మధ్య హద్దులు నిర్ణయించి, రోడ్లను మరమ్మతు చేయించి జాజిరెడ్డిగూడెం నుంచి ఇసుక ట్రాక్టర్లు రాకుండా వేరేదారుల గుండా ఇసుక రవాణాను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

ట్రాక్టర్లు వెళ్లకుండా బందు చేసిన తుంగగూడెం ఇసుక క్వారీ దారి

క్వారీ నుంచి ఇసుక లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్లు (ఫైల్‌)

మూసీనదిలోని ఇసుక క్వారీల వద్ద ఎదురవుతున్న సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. పేరబోయినగూడెం వద్ద రోడ్డును తవ్వడంతో ఇసుక రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రెండు క్వారీలు తాత్కాలికంగా బందయ్యాయి. త్వరలో సమస్యలను పరిష్కరించి ఇసుక రవాణా పునరుద్ధరిస్తాం.

– బాషపాక శ్రీకాంత్‌ తహసీల్దార్‌,

జాజిరెడ్డిగూడెం మండలం

ఫ పేరబోయినగూడెం క్వారీలో ఇసుక నిల్వలు నిల్‌

ఫ ఇక్కడి ట్రాక్టర్లు తుంగగూడెం క్వారీకి..

ఫ ట్రాక్టర్‌ యజమానుల మధ్య ఘర్షణతో బందైన క్వారీలు

ఫ రెండు రోజులుగా నిలిచిన ఇసుక రవాణా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement