సూర్యాపేటటౌన్ : సైబర్ నేరగాళ్ల పడి నష్టపోతున్న బాధితులకు పోలీస్ సిబ్బంది మానవతాదృక్పథంతో సేవలు అందిస్తూ అండగా ఉందామని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం సైబర్ వారియర్ పోలీస్ సిబ్బందికి సైబర్ క్రైమ్ వర్టికల్ ట్రైనింగ్ పేరుతో నిర్వహించిన ప్రత్యేక శిక్షణలో ఆయన మాట్లాడారు. బాధితులు ఆర్థికంగా నష్టపోయిన డబ్బును వీలైనంత త్వరగా తిరిగి వారికి అందేలా కృషి చేయాలన్నారు. జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బందితోసమన్వయం చేసుకుంటూ, సాంకేతికత సహాయంతో సైబర్ మోసగాళ్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ,సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.
హైవేపై నిరంతరం పెట్రోలింగ్
మునగాల : రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. మంగళవారం ఆయన మునగాల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్‌లో ఫిర్యాదుల స్వీకరణ, స్టేషన్ రికార్డులు, సీసీ కెమెరాల నిర్వహణ, కేసుల స్థితిగతులతోపాటు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి భరోసా కల్పించేలా రిసెప్షన్ సెంటర్ సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులను జైలుకు పంపుతామన్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మునగాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఏఎస్‌ఐ వెంకటరత్నం, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఎస్పీ నరసింహ


