సూర్యాపేటటౌన్ : పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎస్పీ నరసింహ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. వివిధ మండలాల నుంచి బాధితులు తరలివచ్చి తమ సమస్యలపై ఎస్పీకి వినతులు అందించారు. వారి నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా, వారి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పెంపుడు జంతువులకు ఉచితంగా టీకాలు
కోదాడరూరల్: ప్రపంచ జంతు సాంక్రమిక వ్యాధుల దినోత్సవం సందర్భంగా సోమవారం పెంపుడు జంతువులకు ఉచితంగా రేబీస్ నిరోధక టీకాలు వేశారు. కోదాడలోని పశువైద్యశాలలో వైద్యాధికారి డాక్టర్ పి.పెంటయ్య ఆధ్వర్యంలో టీకాలు వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ మాట్లాడుతూ పెంపుడు జంతువులకు టీకాలు వేయిస్తేనే యజమానులు సురక్షితంగా ఉండగలుగుతారన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో త్వరలో కుక్కల పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తామని, వీధి కుక్కలకు టీకాలు వేయిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, వైస్ ఛైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, వార్డు కౌన్సిలర్లు కారింగుల ఉమ, క్షేత్రయ్య పశువైద్యుడు సిరిపురం సురేంద్ర పాల్గొన్నారు.
విస్తరణతోనే పెన్షనర్ల సంఘాలు బలోపేతం
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ పెన్షనర్ల సంఘాలు ఎంత విస్తరిస్తే అంత బలంగా ఉంటాయని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. సోమవారం సూర్యాపేట సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ కార్డులు ఈ నెల 15 నుంచి అమలు అయ్యేందుకు, వచ్చే దసరా, దీపావళి నాటికి పీఆర్సీ ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. 2024 తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారి బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.4వేల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


