సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను మెరుగు పరిచేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 18 నుంచి ఎఫ్‌ఎల్‌ఎన్ పరీక్షలు నిర్వహించనుంది. వాటి ఫలితాల ఆధారంగా విద్యార్థుల ప్రస్తుత అభ్యాసన స్థాయిని గుర్తించి, వెనుక బడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో బేస్‌లైన్ టెస్ట్, తర్వాత మిడ్‌లైన్ టెస్ట్, చివరలో ఎండ్‌లైన్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ బేస్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
కనీస విద్యా నైపుణ్యాలు ఉండేలా..
జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ప్రతి విద్యార్థికి ప్రాథమిక స్థాయిలో చదవడం, రాయడం, గణితంలో కనీస నైపుణ్యాలు ఉండేలా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా నిర్వహించే బేస్‌లైన్ పరీక్షల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, చదివే సామర్థ్యం, రాత నైపుణ్యం, సంఖ్యలపై అవగాహన, ప్రాథమిక గణిత ప్రక్రియల్లో వారి ప్రావీ ణ్యం వంటి అంశాలను పరిశీలించనున్నారు. పరీ క్షల అనంతరం ప్రతి విద్యార్థి పనితీరును విశ్లేషించి, అవసరమైన వారిపై ఉపాధ్యాయులు మరింత శ్రద్ధ వహించనున్నారు.
840 పాఠశాలల్లో..
జిల్లాలో 670 ప్రాథమిక, 70 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 2 నుంచి 5వ తరగతి వరకు 24,543 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ బేస్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ మొబైల్ యాప్‌ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల సాఫ్ట్ కాపీలను ముందుగానే జిల్లా విద్యాశాఖ అధికారికి పంపిస్తారు. వాటిని సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందజేసి పరీ క్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ పాఠశాల
విద్యార్థులకు బేస్‌లైన్ పరీక్షలు
వాటి ఫలితాల ఆధారంగా
వెనుకబడిన వారిపై శ్రద్ధ
18 నుంచి 20 వరకు ఎఫ్‌ఎల్‌ఎన్ టెస్ట్‌లు


