గ్రామాల్లో రైతు వేదికల నిర్వహణ నిధుల విషయంలో ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. రైతు వేదికలకు నిధులు రాక ఏఈఓలు ఇబ్బందులు పడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. డబ్బులు విడుదల కాగానే ఏఈఓల ఖాతాల్లో జమ చేస్తాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం.
జి.శ్రీధర్‌రెడ్డి,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి, సూర్యాపేట.
ఫ నాలుగేళ్లుగా రైతు వేదికలకు
అందని నిధులు
ఫ కనీస వసతులు లేక రైతులు, అధికారులకు ఇబ్బందులు
ఫ పేరుకు పోతున్న విద్యుత్ బిల్లులు
ఫ కొన్ని చోట్ల సొంతడబ్బులు వెచ్చిస్తున్న అధికారులు
నాగారం : రైతు వేదికల నిర్వహణ సంబంధిత అధికారులకు భారంగా మారింది. నాలుగేళ్లుగా నిధులు రాకపోవడంతో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓల) సొంతంగా పెట్టుకోవాల్సి వస్తోంది. రైతులకు సాగులో శిక్షణతో పాటు సలహాలు అందించేందుకు ప్రభుత్వం 2021లో క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. రైతు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన వసతులు, సాంకేతిక హంగులను కల్పించింది. కానీ, నిర్వహణ, నిధుల లేమితో వాటి లక్ష్యం నీరుగారుతోంది.
ప్రతి క్లస్టర్‌కు ఒక రైతువేదిక
సూర్యాపేట జిల్లాలో 86 క్లస్టర్లు ఉన్నాయి. 2021లో అప్పటి ప్రభుత్వం ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదికను నిర్మించింది. ఒక్కో రైతువేదికకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.10 లక్షలు, వ్యవసాయశాఖ నుంచి రూ.12 లక్షలు సమకూర్చి మొత్తం రూ.22 లక్షలు వెచ్చించి ఒకే నమునాలో నిర్మించింది. జిల్లాలో 2.81లక్షల మంది రైతులు ఉండగా, 82 రైతు వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో వేదికలో రెండు గదులు, విశాలమైన సమావేశ మందిరాన్ని నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఏఈఓలకు అప్పగించారు. రైతులతో సమావేశాలు నిర్వహించడం, సాగులో మెళకువలను నేర్పించడం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభ్యుదయ, ఆదర్శ రైతుల అనుభవాలను పంచుకోవడం, శాస్త్రవేత్తల సూచనలు అందజేయడం ఈ వేదికల ప్రధాన ఉద్దేశం.
సదుపాయాలు కరువు
ఒక్కో రైతు వేదిక నిర్వహణకు మొదట ప్రతినెలా రూ.3వేలు కేటాయించగా అవి సరిపోవడం లేదని అధికారులు తెలపడంతో రూ.9వేలకు పెంచింది. 2022 డిసెంబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు మాత్రమే నిర్వహణ నిధులు వచ్చాయి. ఆ తర్వాత నిధులు నిలిచిపోయాయి. దాంతో వేదికల్లో కనీస సదుపాయాలు లేకుండా పోయాయి. చాలా చోట్ల తాగునీటి సదుపాయం లేదు. వేదికలను శుభ్రం చేసేందుకు, మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు లేక దారుణంగా మారాయి. కొందరు ఏఈఓలు సొంత డబ్బులు వెచ్చించి కార్యాలయాలను శుభ్రం చేయించుకుంటున్నారు. కార్యాలయాల్లో విద్యుత్ బిల్లులు పేరుకుపోతున్నాయని, కరెంట్ కట్ చేస్తే విధుల నిర్వహణకు ఆటంకం కలుగుతుందని పలువురు ఏఈఓ ఆందోళన చెందుతున్నారు.


