సూర్యాపేటటౌన్ : కేసులు పెండింగ్ లేకుండా, అవి త్వరగా విచారణ పూర్తి అయ్యేలా చూడాలని ఎస్పీ కె. నరసింహ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల నుంచి కోర్టు డ్యూటీ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందితో శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. కోర్టు విధుల నిర్వహణకు సంబంధించి సలహాలు, సూచనలు అందించారు. పనిలో నాణ్యత, పారదర్శకత ఉండాలని, పెండింగ్ ఉండకుండా కోర్టు వారెంట్, సమన్‌లు సకాలంలో అందజేయాలని సూచించారు. సిబ్బంది కోర్టులలో సమన్వయంగా, సమయపాలనతో పనిచేయాలని, ఎప్పటికప్పుడు కేసుల స్థితిగతులను రికార్డులలో, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. బాధితులను, సాక్షులను, నిందితులను సకాలంలో కోర్టులలో ప్రవేశపెట్టి కేసులు త్వరతగతిన పరిష్కారం అయ్యేలా సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల్లో త్వరితగతిన నేరస్తులకు శిక్షలు అమలు అయితేనే క్షేత్రస్థాయిలో నేరాలను అదుపు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది కోర్టు అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పరస్పరం చేరవేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్పీ డీఎస్పీ రవి, ఇన్‌స్పెక్టర్ మగ్దూం అలీ, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ, కోర్టు డ్యూటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కోర్టు డ్యూటీ సిబ్బంది
సమావేశంలో ఎస్పీ నరసింహ


