భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీరాజ్ ఏఈలు, ఏపీఎంలతో వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోని ముఖ్య అంశాలను అధికారులకు వివరించారు. వానాకాలంలో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున, రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు వేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయం, తాగునీరు, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి అంశాల్లో నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. వీబీ జీరాంజీ పథకం కింద కూలీలకు పనిదినాలను 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. పెంచిన పనిదినాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ, ఇంకుడు గుంతల నిర్మాణంపై శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్డీఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, డీఈఓ అశోక్, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్‌రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష, తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


