ఉపాధిహామీ పథకం కార్యాలయాల్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లు, ఏపీఓలు, ఇంజనీరింగ్, టెక్నికల్, ఫీల్డ్‌అసిస్టెంట్లు వీబీ జీరామ్‌జీ పరిధిలోకి వస్తారు. ఉద్యోగుల హోదాలు కూడా మారుతాయి. ఉపాధిహామీ పథకంలో పని చేసిన సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించారు. కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంట్స్ అసిస్టెంట్లు ఇకపై డిజిటల్ అడ్మినిస్ట్రేషన్‌అసిస్టెంట్లుగా మారనున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను గ్రామీణ రోజ్‌గార్ సహాయక లేదా గ్రామ కాయకల్ప సహాయక్‌గా, టెక్నికల్ అసిస్టెంట్లను రూరల్ ఈన్‌ఫ్రాస్ట్రక్చర్ అసోసియేట్‌గా పిలుస్తారు. ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు మిషన్‌న్‌ఇంజనీరింగ్ అసోసియేట్‌గా మారనున్నారు. అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్ల హోదా అసిస్టెంట్ మిషన్ మేనేజర్‌గా మారుతుంది.
నల్లగొండ (భానుపురి) : గ్రామాల్లో ఉపాధి లభించక వలస వెళ్తున్న కూలీలకు సొంతూళ్లోనే ఉపాధి కల్పించేందుకు రెండు దశాబ్దాలుగా కొనసాగుతన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎన్‌ఆర్‌ఈజీఎస్ చట్టం స్థానంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ (వీబీ జీరామ్‌జీ) తీసుకు వచ్చింది. ఈ పథకం బుధవారం నుంచి అమల్లోకి వస్తోంది.
జిల్లాలో 2,61,192 జాబ్ కార్డులు
జిల్లాలో 2,61,192 జాబ్ కార్డులు, 5,69,350 మంది కూలీలు ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకంలో ఉపాధిహామీ పథకంలో కూలీలకు కలిగిన ఇబ్బందులను తొలగించడంతో పాటు అనేక మార్పులు, చేర్పులు చేసింది. ఇప్పటివరకు ఉపాధిహామీ పథకానికి అవసరమైన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 75 నుంచి 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 నుంచి 25 శాతం వెచ్చించేవి. వీబీ జీరామ్‌జీ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ 40 శాతం నిధులను సమకూర్చేలా మార్పులు చేశారు.
పనిదినాలు 125కు పెంపు
కేంద్ర ప్రభుత్వం 2025లో వీబీ జీరామ్‌జీ చట్టం రూపొందించి చట్టసభల్లో ఆమోదించింది. దీని ప్రకారం గతంలో కూలీలకు 100 రోజుల పని దినాలను కల్పిస్తే కొత్త చట్టంలో వాటిని 125 రోజులకు పెంచారు. కూలీలకు సమయానికి వేతనాలు చెల్లింపు, ఒకవేళ ఆలస్యమైతే వేతనంతో పాటు పరిహారం చెల్లిస్తారు. కూలీలకు 15 రోజుల్లో పనులు చూపకపోయినా నిరుద్యోగ భృతి వారి ఖాతాల్లో జమ అవుతుంది.
పనుల విభజన
ఈ పథకంలో పనులను నాలుగు విభాగాలుగా విభజించారు. వీబీ జీరామ్‌జీ ద్వారా గ్రామాల్లో చేపట్టే అన్ని పనులను గ్రామపంచాయతీ ప్రణాళికలో నమోదు చేస్తారు. దాంతో చేసిన పనులు మళ్లీ మళ్లీ చేసే అవకాశం ఉండదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. గతంలో జరిగిన అక్రమాలు తొలగిపోతాయని చెబుతున్నారు. వ్యవసాయంలో 50 శాతం పనులు చేపట్టే వీలు ఉంది. పంటల సాగులో విత్తనాలు వేయడం, పంట కోతల పని దినాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకునే వీలుంది. 60 రోజులపాటు వ్యవసాయ పనులు సజావుగా సాగే వీలు కల్పించారు.
కొన్ని వర్గాలకు ప్రత్యేక కార్డులు..!
వీబీ జీరామ్‌జీ పథకంలో భాగంగా కొన్ని వర్గాలకు ప్రత్యేక కార్డులు జారీ చేసేలా నిబంధనలు పొందుపరిచారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన వారికి, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కార్డులను అందిస్తారు. ఆరు నెలలకు ఒకసారి సామాజిక తనిఖీలు నిర్వహిస్తారు. ఉపాధి పథకం జాబ్‌కార్డ్ స్థానంలో గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కార్డును ఇవ్వనున్నారు. కార్డు కాలపరిమితి మూడేళ్లుగా ఉంటుంది. ప్రత్యేక వర్గాలకు స్పెషల్ కార్డులు మంజూరు చేస్తారు. ప్లానింగ్ విధానంలో మార్పులతో రాష్ట్రాలకు లేబర్ బడ్జెట్ ఉండదు. కేంద్రం నుంచే నిధులు నిర్దేశిస్తారు. డిమాండ్ పెరిగితే అదనపు ఖర్చును రాష్ట్రాలే భరించాల్సి ఉంటుంది. ఉపాధి పథకం నిర్వహణలో ఏదైనా లోపాలు జరిగితే గతంలో రూ.వేయ్యి జరిమానా విధించేవారు. కొత్త పథకం ద్వారా జరిమానాను రూ.10 వేలకు పెంచారు. ఈ పథకం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే విషయమై కూలీల్లో అయోమయం నెలకొంది.
వీబీ జీరామ్‌జీ పేరుతో అమలు
ఫ 125 రోజులకు పెరిగిన పని దినాలు
ఫ గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ
కార్డులు అందజేత


