ప్రాజెక్టులు పూర్తిచేసి నీళ్లు పారిస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులు పూర్తిచేసి నీళ్లు పారిస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

Jun 29 2026 5:22 AM | Updated on Jun 29 2026 5:22 AM

వచ్చే ఎన్నికల నాటికి...

ఎస్‌ఎల్‌బీసీ, డిండి

నల్లగొండ : ఎస్‌ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఆ బాధ్యత భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక మంత్రి చూస్తారన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్‌ మండల కేంద్రంలో రూ.13 వేల కోట్లతో చేపట్టిన హ్యామ్‌ రోడ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లగొండలోని ఎన్జీ కళాశాల బహిరంగ సభ ప్రాంగణం వద్ద రూ.83 కోట్లతో మంచి నీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేసి కృష్ణాజలాలను నల్లగొండ గడ్డపై పారిస్తానని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిండి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మూసీ కంపు, కాలుష్యం నుంచి జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తానని చెప్పారు. మూసీ కంపు వల్ల జిల్లాలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

మా ప్రభుత్వం ఎందుకు పోవాలి

‘నేను నడుచుకుంటూ వస్తున్న సమయంలో కొందరు యువకులు నాకు ఇలా చెప్పారు. సూర్యాపేటలో తులసివనంలో గంజాయి మొక్క ఉందన్న. ఆ మూడు జానలాయన కోమటిరెడ్డిని విమర్శిస్తుండు. ఈ సారి ఆ గంజాయి మొక్కను గెలువనివ్వమని నాకు చెప్పారు. నేను కూడా మీకు చెబుతున్నా ఆ ఒక్క మొక్కను కూడా పీకేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన పోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. మా ఆడపడుచులంతా.. కళ్ల సంబురంగా నేను పెట్టిన చీరనుకట్టుకుని వచ్చిండ్రు. నేను అడుగుతున్నా.. వడ్డీలేని రుణాలు ఇచ్చినందుకు ప్రజా ప్రభుత్వం పోవల్నా.. గ్యాస్‌, సన్న బియ్యం, రైతుభరోసా వంటి సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు మా ప్రభుత్వం పోవాల్నా’ అంటూ ముఖ్యమంత్రి వేదిక నుంచి ప్రశ్నించారు.

మిగతా నియోజకవర్గాలకు

నిధులివ్వాలి

జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే వారి నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి అన్నారు. తన పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని మిగతా నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి ఆలోచించి నిధులు మంజూరు చేయాలని కోరారు. సాగర్‌ నియోజకవర్గంలో హైలెవల్‌, లోలెవల్‌ కెనాల్‌ పూర్తిచేసి లింక్‌ కలపాలని, డిండి, ఎదుల్ల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. మిర్యాలగూడ నియోజక వర్గ పరిధిలోని నాలుగు ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.

75వేల రేషన్‌ కార్డులు ఇచ్చాం

ధాన్యం దిగుబడిలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దేశంలో ధాన్యం దిగుమతి కొనుగోళ్లలో తెలంగాణ ముందుంటే.. తెలంగాణలో నల్లగొండ జిల్లా ముందుందన్నారు. జిల్లాలో కొత్తగా 75 వేల రేషన్‌ కార్డులు మంజూరు చేశామన్నారు. ఏఎమ్మార్పీ, సాగర్‌ కాల్వల ఆదునీకరణ పనులు చేపట్టామన్నారు. నా జీవితంలో ఇంత పెద్ద రోడ్ల ప్రాజెక్టు ఎక్కడా ఒకేసారి చేపట్టిన దాఖలాలు లేవన్నారు.

ఫ మూసీ కంపు, కాలుష్యం నుంచి

నల్లగొండకు విముక్తి కల్పిస్తాం

ఫ సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం పోవాల్నా

ఫ నల్లగొండ బహిరంగ సభలో

ముఖ్యమంత్రి

సొరంగం పూర్తయితే నాలుగు లక్షల ఎకరాలకు నీరు

మూసీ కాలుష్యంతో ఇబ్బందుల్లో ఉన్న మన జీవితాలను మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళనకు పూనుకున్నాడని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాలనను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు చూస్తున్నారని, ‘కేసీ ఆర్‌, కేటీఆర్‌ మీరు ఒకసారి నకిరేకల్‌ ప్రాంతంలో రాత్రి నిద్రపోయి చూడండి, ఇక్కడి ప్రజలు దోమలతో, మూసీ కంపుతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుంది’ అన్నారు కుర్చీ వేసుకుని కూర్చొని ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయిస్తానని కేసీఆర్‌ ఎన్నికల్లో ప్రకటించి ఒక్కసారి కూడా అక్కడికి పోలేదన్నారు. సొరంగం పూర్తయితే 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో నల్లగొండలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. నల్లగొండను కార్పొరేషన్‌ చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement