అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున ఉషాపద్మినీ ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్‌స్వామి, గణపురం నరేష్, అర్చకుడు భీంపాండే పాల్గొన్నారు.
జూలై 1న కలెక్టరేట్ ముట్టడి
నేరేడుచర్ల : ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1న కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు కావస్తున్నప్పటికీ పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఆరోపించారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రభుత్వ భూములలో నిరుపేదలు గుడిసెలు వేసేకుంటే నేటికీ పట్టాలు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ఇటీవల వరంగల్ జిల్లా గుండ్ల సింగారంలో సీపీఐ ఆధ్వర్యంలో వేలాది మంది పేదలకు గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వం బుల్డోజర్లతో నేలమట్టం చేసిందన్నారు. సీపీఐ కార్యాలయాన్ని కూడా కూల్చివేయడం బాధాకరమన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధనుంజయనాయుడు, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మి, నాయకులు చిలకరాజు శ్రీను, భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌గా రాజమల్లయ్య
సూర్యాపేట : ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌గా సూర్యాపేటకు చెందిన న్యాయవాది ఇందారపు రాజ మల్లయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ తనకు నియామక పత్రం అందించినట్లు చెప్పారు. పార్టీ జిల్లా కో–కన్వీనర్‌గా తన్నీరు వెంకన్న, వర్కింగ్ కన్వీనర్‌గా తక్కలపల్లి శ్యామ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మారగాని సైదులు, సంయుక్త కార్యదర్శిగా రింగు ఐలయ్య, కోశాధికారిగా గ్యార అంజయ్య, సలహాదారులుగా మెరుగు విక్రమేందుకుమార్‌ను నియమించినట్లు తెలిపారు.
లక్ష్మీనరసింహునికి నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం అర్చకులు స్వామి వారి నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలంకరణతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. కల్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


