నాగారం: రైతులకు సకాలంలో యూరియా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అందుబాటులోకి తెచ్చిన ‘ఫర్టి లైజర్ బుకింగ్ యాప్’ను ప్రస్తుతం ఆధునీకరించింది. ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకొని, నేరుగా దుకాణాలకు వెళ్లి తెచ్చుకునేలా పలు కీలక మార్పులు చేసింది. దాంతో రైతుల ఇబ్బందులు తీరనున్నాయి.
స్థానిక రైతులకే ప్రాధాన్యం
గతంలో ఏ ప్రాంతానికి చెందిన రైతైనా.. ఎక్కడైనా బుక్ చేసుకునే అవకాశం ఉండేది. దీనివల్ల స్థానిక రైతులకు యూరియా దొరక్క ఇబ్బంది పడేవారు. ఈ సమస్యను దూరం చేస్తూ, ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి మండల యూనిట్‌గా యూరియా బుక్ చేసుకునేలా మార్పులు చేశారు. దీంతో ఏ మండలానికి చెందిన రైతులు ఆ మండలంలోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
డీలర్ల ఇష్టారాజ్యానికి చెక్..
గతంలో కొందరు యూరియా డీలర్లు తమకు తెలిసిన వారికి ముందే సమాచారం ఇచ్చి, ఆన్‌లైన్ కోటాను ఆఫ్‌లైన్‌లో దారి మళ్లించేవారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం యాప్‌లో కొత్తగా టైమ్ స్లాట్లను జోడించింది. దీని ద్వారా డీలర్లు మధ్యాహ్నం 3 గంటల తర్వాత యూరియా స్టాక్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే.. అది మరుసటి రోజు ఉదయం 6 గంటలకే రైతులకు కనిపిస్తుంది. ఉదయం 6 గంటల తర్వాత ఆన్‌లైన్‌లో పెడితే.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకే రైతులకు కనిపిస్తుంది. రైతులు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు యాప్‌లో లాగిన్ అయి యూరియా బుక్ చేసుకోవచ్చు. ఎక్కడ, ఎంత స్టాక్ ఉందో కూడా తెలుసుకోవచ్చు.
ఎకరానికి రెండు బస్తాలే
గతంలో కొందరు యూరియా కొరతను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ కోటా కోసం పంటల నమోదు సమయంలో ‘మొక్కజొన్న’ను ఎంపిక చేసుకునేవారు. మొక్కజొన్నకు ఎకరానికి 5 బస్తాలు ఇచ్చేవారు. కానీ ఈ సారి యూరియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ఏ పంట సాగు చేసినా ఎకరానికి రెండు బస్తాలు మాత్రమే బుక్ అవుతుంది.
ఓటీపీల ఇబ్బంది లేదు
యాప్‌ను అధికారులు పూర్తిగా అప్‌డేట్ చేశారు. గతంలో యాప్‌లోకి లాగిన్ అయిన ప్రతిసారీ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చేది. ఓటీపీ ఎంటర్ చేస్తేనే యూరియా బుక్ అయ్యేది. ఇప్పుడు ప్రతిసారీ ఓటీపీ అవసరం లేకుండా, నేరుగా యాప్‌లోకి వెళ్లి సులభంగా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఫ యాప్‌లో మార్పులు చేసిన ప్రభుత్వం
ఫ మండల యూనిట్‌గా బుకింగ్‌కు అవకాశం
ఫ ఓటీపీతో పనిలేదు
ఫ ఎకరానికి 2 బస్తాలకే చాన్స్


