మఠంపల్లి: ఎస్సీలు కూడా సమాజంలో భాగమేనని, వారిపై వివక్ష చూపకుండా అందరికీ సమన్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మఠంపల్లిలో ఇటీవల ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోగా ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై మండల కేంద్రానికి చెందిన తుపాకుల జ్యోతి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తన కుమారుడు మహేష్‌పై కొందరు దాడి చేసి గాయపర్చారని, అయినా అతడిపైనే పోలీసులు కేసు నమోదు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన కమిషన్ చైర్మన్ ఆదివారం బాధిత కుటుంబాలను పరామర్శించారు. జరిగిన ఘటనపై విచారించారు. అనంతరం వెంకటయ్య స్థానిక విలేకరులతో మాట్లాడారు. దళిత యువకుడు మహేష్‌పై దాడి జరిగినప్పుడు పోలీసుశాఖ సమస్యలను గుర్తించి చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు. దెబ్బలుతిన్న ఎస్సీ వారిపై 307 కేసు నమోదుచేసి, అవతలి వారిపై సాధారణ కేసు నమోదు చేయడం సరికాదన్నారు. దాడికి పాల్పడిన వారిపై కూడా 307 కేసు నమోదు చేయాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి సూచించారు. బాధితులకు జరిగిన అన్యాయంపై ఎస్పీతో మాట్లాడతానని, అవసరమైతే జిల్లా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తానని తెలిపారు. ప్రతి నెల చివరి వారంలో పోలీసు, రెవెన్యూ అధికారులు అన్ని సంఘాల నాయకులను పిలిచి సివిల్ రైట్ డే నిర్వహించి ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు, ఆయన వెంట బాధిత కుటుంబాలతో పార్టీ ఆర్డీఓ శ్రీనివాసులు, తాహసీల్దార్ కె.హిమబిందు, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, డీటీ బాలరాజు, ఎంపీఓ నవీన్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఇరుగు పిచ్చయ్య, చిలక దేవభిక్షం, దేవపంగు ప్రసాదు, ఆరాల నాగరాజు, బచ్చలకూరి ప్రసాద్, భూక్యా బాలునాయక్ ఉన్నారు.
ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య


