సూర్యాపేట (భానుపురి) : ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూడాలని రాష్ట్ర అగ్రికల్చర్ కోఆపరేటివ్ సెక్రటరీ, ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేకాధికారి కె.సురేంద్రమోహన్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి రంగాలలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడం, లబ్ధిదారుల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడం, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి అధికారులు చేయాలన్నారు. జిల్లాలో ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంపై జిల్లా కలెక్టర్‌తో పాటు, అధికారులను అభినందించారు. రైతులకు వ్యవసాయశాఖ యాప్‌లపై, ఎరువులు, విత్తనాలపై అవగాహన కల్పించాలని, ఆర్గానిక్ పంటలు పండించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. రైతు వేదికలలో రైతులకు సన్న వడ్ల విత్తనాలు, ఫర్టిలైజర్స్ అందించాలని, ఇందుకు నోడల్ ఆఫీసర్‌గా అదనపు కలెక్టర్ ఉంటారని తెలిపారు. సంక్షేమ హాస్టల్స్‌ను అధికారులు వారానికి ఒక సారి సందర్శించి విద్యార్థుల సమస్యలు తీర్చాలని సూచించారు. అనంతరం ఆయా శాఖలకు సంబంధించి చేపట్టిన కార్యక్రమాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, జెడ్పీ సీఈఓ శిరీష, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజ్, డీఆర్‌డీఏ సన్యాసయ్య, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్ నాయక్, డీఏఓ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్


