మునగాల: మండలంలోని నర్సింహులగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని నాగార్జుననగర్‌లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కొంతకాలంగా విద్యార్థులు లేక మూతబడింది. ఈ విద్యాసంవత్సరం పాఠశాలను తెరిపించేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం, ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. 25 మంది విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. దాంతో సోమవారం నుంచి పాఠశాలను పునరుద్ధరించనున్నట్లు ఎంఈఓ తెలిపారు. కార్యక్రమంలో గ్రామసర్పంచ్ కుంచం ఇందిర, ఉప సర్పంచ్ మొగిలిచెర్ల సీతారాములు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.


