మత్తులో తూలి.. ప్రాణాలు గాలికి | - | Sakshi
Sakshi News home page

మత్తులో తూలి.. ప్రాణాలు గాలికి

Jul 19 2026 2:20 AM | Updated on Jul 19 2026 2:20 AM

మత్తులో తూలి.. ప్రాణాలు గాలికి ● డ్రైనేజీలో పడి యువకుడు మృతి

● డ్రైనేజీలో పడి యువకుడు మృతి

శ్రీకాకుళం క్రైమ్‌ : గుడికి యాభై మీటర్ల దూరంలో మద్యం దుకాణం.. అది చాలదు అన్నట్లు కాసింత దూరంలోనే బెల్టుషాపు.. ఇంకేముంది మందుబాబుల జేబులు, శరీరాలు గుల్ల చేసేస్తూ మద్యం పోసేస్తున్నారు. సర్కారు అత్యాశ చాలా మంది ప్రాణాలు తీస్తోంది. ఆ జాబితాలో ఇంకొకరి పేరు చేరింది. జిల్లాకేంద్రంలోని బలగమెట్టు సమీప బుచ్చిపేట శ్రీరామమందిరం వద్ద రోడ్డున ఆనుకొని ఉన్న డ్రైనేజీలో పడి శనివారం వేకువజామున ఓ యువకుడు మృతిచెందాడు. స్థానిక రామ మందిరానికి 50 మీటర్ల సమీప దూరంలోని వైన్‌షాపులోనే కాక ఓ బెల్టుషాపులో సైతం రాత్రంతా పూటుగా మద్యం సేవించినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు, రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కొయ్యాన సత్యం(29) భార్య పావని, ఇద్దరు కుమార్తెలతో కలసి ఇదే బుచ్చిపేటలో నివసిస్తున్నాడు. ప్రతి రోజూ రాత్రి రామమందిరం వద్దకు వచ్చి అక్కడే నిర్మించిన ఫ్లాట్‌ఫాంపై నిద్రపోవడం ఆయనకు అలవాటు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నిద్రపోవడానికి వచ్చిన సత్యం వేకువజామున 3 గంటలు దాటాక మెలకువ వచ్చి లేచి తూలుతూ కిందపడ్డాడు. మళ్లీ తమాయించుకుని లేచి పక్కనే ఉన్న కొత్తగా నిర్మించిన పలకలు లేని డ్రైనేజీలో పడిపోవడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. ఇదంతా సమీప సీసీ పుటేజీలో నిక్షిప్తమైంది. ఉదయం స్థానికులు చూసే సరికి సత్యం డ్రైనేజీలో శవమై తేలాడు. అతిగా మద్యం తాగడం అతడి తప్పిదమైతే.. డ్రైనేజీలపై పలకలు వేయకపోవడం, గుడికి దగ్గరలో వైన్‌షాపు పెట్టడం, దానికి సమీపంలో బెల్టుషాపు ఏర్పాటు చేయడం పరోక్షంగా అతడి మృతికి కారణమయ్యాయని స్థానికులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement