30 ఏళ్ల వయసు గల నా భర్తను అన్యాయంగా రోడ్డు ప్రమాదంలో
చంపేశారు. ఆయన ప్రాణానికి రూ.లక్ష విలువ కట్టారు. గార కృష్ణారావు అనే వ్యక్తి ఈ రోడ్డు ప్రమాదానికి కారణం. నా ఇద్దరు పిల్లలూ చిన్న పిల్లలే. నేను హార్ట్ పేషెంట్‌ని. వారిని పెంచి పోషించే శక్తి నాలో లేదు.
నాకు న్యాయం చేయండి.
– రోజా, రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నర్తు వెంకటరమణ భార్య
నా తమ్ముడు వెంకటరమణ కిందటి సోమవారం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనే కంటే నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు బలయ్యాడనే చెప్పాలి. గ్రామ పెద్దల వద్దకు విషయం తీసుకెళ్లినా సరైన న్యాయం జరగలేదు. కూలి చేసుకుని కడుపులు నింపుకునే జీవితాలు మావి. తమ్ముడి భార్య హార్ట్ పేషెంట్, నాలుగు నెలల అబ్బాయి, రెండేళ్ల పాప ఉన్నారు. ఇప్పుడీ మూడు జీవితాలు రోడ్డు మీద పడేశారు. కులమతాలకు అతీతంగా నా తమ్ముడు కుటుంబాన్ని ఆదుకోవాలి.
– రవికృష్ణ, మృతుడి సోదరుడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
పలాస నియోజకవర్గం మందస మండలం పితాతొళి వద్ద మందస టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు గార కృష్ణారావు ఆటో యాక్సిడెంట్ ఘటనలో నర్తు వెంకటరమణ అనే వ్యక్తి చనిపోయారు. ఈ నెల 13వ తేదీన స్కూటీపై లోహరిబందకు చెందిన నర్తు వెంకటరమణ, మురపాల తులసమ్మ వెళ్తుండగా పితాతొళి వద్ద ఎదురుగా వచ్చిన టీడీపీ నాయకుడి ఆటో వీరి బండిని ఢీకొట్టింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీసులు నమో దు చేసిన కేసులో ఆటో డ్రైవర్‌గా గుడ్డిభద్ర సునీల్ ఉన్నాడని పేర్కొన్నారు. కానీ అదే ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి మురపాల తులసమ్మ మాత్రం టీడీపీ నాయకుడు గార కృష్ణారావే గుద్దేశాడని చెబుతున్నారు. మృతి చెందిన యువకుడి ప్రాణానికి రూ. లక్ష విలువ కట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రుల దుర్నీతికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్‌పై ఏకంగా హత్యా నేరం సెక్షన్లు నమోదు చేయగా, మందస టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు గార కృష్ణారావు ఆటో ఢీకొట్టి, ఒకరి చావుకు, మరొకరికి గాయాలకు కారణమైతే రోడ్డు ప్రమాద సెక్షన్లు పెట్టి వదిలేశారు. సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్‌లో మృతి చెందిన దానయ్య కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష, జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హుటాహుటిన పరామర్శించి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు లక్ష్యంగా ప్రెస్‌మీట్ పెట్టి టార్గెట్ చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరి నుంచి చినబాబు వరకు ఎక్కడికక్కడ బహిరంగ సభల్లో సీదిరి అప్పలరాజును లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు.
ఇప్పుడే అదే ఎమ్మెల్యే గౌతు శిరీష నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు ఆటో ఢీకొట్టిన ప్రమాదంలో మృతి చెందిన నర్తు వెంకటరమణ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు. ఆ కేసు కోసం వాకబు చేయలేదు. ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వచ్చి పరిహారం ప్రకటించే ప్రయత్నం చేయలేదు. ఒక్క టీడీపీ నాయకుడు కూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లలేదు. పోయిన ప్రాణానికి రూ.లక్ష వెల కట్టి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పోలీసులేమో సునీల్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేశాడని కేసులో పేర్కొనగా, మృతుడి కుటుంబీకులు, గాయపడిన మహిళ మాత్రం గార కృష్ణారావే గుద్దేశాడని చెబుతున్నారు. అంటే, ఇక్కడ డ్రైవింగ్ చేసిన వ్యక్తిని మార్చినట్టే అవుతోంది. ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేశారా? లేదంటే అధికార పార్టీ నాయకుడు అని వదిలేశారా? అన్నది పోలీసులు, చంద్రబాబు ప్రభుత్వమే చెప్పాలి.


