రెండు శాఖలపైన సమీక్ష
జిలా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖల ప్రగతి నివేదికలపైనే సభ్యులు చర్చించారు. జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలి ప్రాధాన్యతగా తోటపల్లి, వంశధార, మడ్డువలస రిజర్వాయర్‌ల ఆయకట్టుకు చివరి పొలాల వరకు నీరందకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని జెడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రస్తావించారు. ఇంజినీరింగ్ అధికారుల చేతకానితనం వల్లనే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఎమ్మెల్యే కూన అన్నారు. పైడిగాం రిజర్వాయర్ పనులపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలని జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, సోంపేట ఎంపీపీ నిమ్మన దాసు కోరారు. రైతులకు పనిముట్లు ఇవ్వలేదని కంచిలి ఎంపీపీ దేవదాస్‌రెడ్డి తెలిపారు.
కార్గో పేరుతో ప్రకృతి సంపద ధ్వంసం
నరసన్నపేట: కార్గో ఎయిర్ పోర్టు పేరుతో పచ్చటి ఉద్దానాన్ని ధ్వంసం చేయవద్దని, జిల్లా అభివృద్ధి చెందాలంటే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ అన్నారు. స్థానిక జమ్ము కూడలి వద్ద ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం పి.ఆరేలమ్మ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, గిరిజనుల ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వాలని కోరారు. నరసన్నపేట ప్రాంతంలో అక్రమ కట్టడాలు, చెరువుల ఆక్రమణలు కూటమి నాయకులు చేస్తున్నారని విమర్శించారు.
అరసవల్లి:
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. శుక్రవారం జరిగిన సమావేశంలో సభ్యు లు ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలోనే వసతి గృహంలో విద్యార్థి చనిపోయినా, యూరియా కోసం నిలబడి ఓ మహిళా రైతు మృత్యువాత పడినప్పటికీ ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడంపై టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి నిలదీయడంతో సభలో తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యేనే అంటూ ఆమదాలవలస కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి తోడు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా వైఎస్ జగన్‌ను ఏకవచనంతో పిలవడంతో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు ఇద్దరు ఎమ్మెల్యేలను చుట్టుముట్టారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్లుగా జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ ప్రకటించారు.
పరిహారానికీ రాజకీయమేనా..
ఎరువు కోసం వెళ్లి మహిళా రైతు చనిపోతే మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి ఆక్షేపించారు. మాజీ మంత్రి సీదిరి కుమారుడి బైక్ యాక్సిడెంట్‌లో ఓ గొర్రెల కాపరి చనిపోతే రూ.10 లక్షలు ఇవ్వడం మంచిదేనని, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరణించిన రైతు కాంతమ్మ, హాస్టల్ విద్యా ర్థి కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదని సూటిగా ప్రశ్నించారు. దీనిపై జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విఠల్‌రావు జోక్యం చేసుకుంటూ పలాసలో రోడ్డు ప్రమాద మృతుని కుటుంబానికి పార్టీ తరఫున ఇచ్చామని చెప్పగా.. వాణి స్పందిస్తూ పరిహారాల్లో నూ రాజకీయాలు చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు.
అనంతరం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి మాట్లాడుతూ బాధితులకు పరిహారం అడగడంలో తప్పు లేదని, కానీ మంత్రి అచ్చెన్నాయుడును ప్రస్తావించేటప్పుడు మర్యాద ఇవ్వకపోవడంపై అభ్యంతరం తెలిపారు. వైఎస్ జగన్ కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే అని... అందుకే జగన్ అంటూ మాట్లాడుకుంటామన్నారు. దీంతో జెడ్పీటీసీలు సిరి పురపు జగన్మోహనరావు, దువ్వాడ వాణి, టొంపల సీతారాం, నాగేశ్వరరావు, ఎంపీపీలు దేవదాస్‌రెడ్డి. నిమ్మన దాసు సురేష్ ముఖర్జీ తదితరులు చుట్టుముట్టి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రస్తావించేటప్పుడు మర్యాద ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ స్పందిస్తూ ‘గూండాల్లా దాడి చేస్తారా’ అంటూ జెడ్పీటీసీలను ఉద్దేశించి అన్నారు. దీంతో వాగ్వాదం జరిగింది.
సభ వాయిదా
జల వనరులు, వ్యవసాయ శాఖల ప్రగతిపై మాత్రమే చర్చలు జరిగాయని, పరిస్థితుల దృష్ట్యా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ ప్రకటించారు. యూరియా కోసం క్యూలో నిలబడి మహిళ కాంతమ్మ మృతికి కారణాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లుగా ఆమె స్పష్టం చేశారు. రాజకీయ ప్రకటనలకు ఇది వేదిక కాదని, ఏదైనా ఉంటే నేరుగా కలెక్టర్‌ను కలిసి చెప్పుకోవాలన్నారు. వాగ్వాదాలు పెరగడంతో మైక్‌లు కట్ చేశారు.
వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం
ప్రభుత్వ వైఖరిపై సభ్యుల మండిపాటు
మహిళా రైతు, వసతి గృహ విద్యార్థి
కుటుంబాలను పరామర్శించకపోవడంపై ఆక్షేపణ
పరిస్థితుల తీవ్రత చూసి సభను వాయిదా వేసిన జెడ్పీ చైర్‌పర్సన్


