గార: ప్రముఖ విష్ణు ఆలయం శ్రీకూర్మం శ్రీకూర్మనాథున్ని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సతీమణి సీమా గుప్తా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆమెకు అధికారులు, అర్చకులు ఎదు రేగి స్వాగతం పలికారు. మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్షేత్ర మహాత్యాన్ని ఆలయ అర్చకులు మురళీకృష్ణమాచార్యులు తెలియజేశారు. స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో పద్మనాభాచార్యులు, శ్రీనివాసాచార్యులు, కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని ఏపీ పీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం సోమవారం శ్రీకాకుళంలోని పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఆర్టీసీ జేఏసీ నాయకులు కలిసి ఆర్టీసీని ప్రభు త్వ ఆధీనంలోనే కొనసాగించాలని కోరుతూ వినతిపత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, వాటి నిర్వహణ బాధ్యతను ఆర్టీసీ యాజమాన్యమే నిర్వహించాలన్నారు. ఆర్టీసీలో విలువైన ఆస్తులను ప్రైవేటు ఆపరేటర్లకు కట్టబెట్టే ఆలోచనలను విరమించుకోవాలని, విద్యుత్ బస్సు ఆపరేటర్ల కోసం డిపోలను ఖాళీ చేయించే ఆలోచనలను విరమించుకోవాలని కోరారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలని, విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకునేందుకు చేస్తున్నదే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు వై.అప్పయ్య, జి.త్రినాథ్, కె.బాబూరావు, ఎస్వీ రమణ, ఎన్‌వీఆర్ మూర్తి, కె.నర్సింహులు, బీఎస్ బాబు, బి.ఆనంద్ తదితరులు ఉన్నారు.
ఎచ్చెర్ల: ఏపీ పాలిసెట్ – 2026 రెండో దశ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్సన్స్ నమోదుకు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.నారాయణరావు తెలిపారు. ఇప్పటివరకు వెబ్ ఆప్సన్లు నమోదు చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియెగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు వెబ్ ఆప్సన్లు నమోదు చేసే సమయంలో కళాశాలలు, కోర్సులను తమ ప్రాధాన్యత క్రమంలో జాగ్రత్తగా ఎంపిక చేసుకుని అనంతరం ఫ్రీజ్ చేయాలన్నారు.


